వెళ్ల‌ద్దు ఉండండి.. : జ‌గ‌న్ విన్న‌పాలు

వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యులు ఒక్కొక్క‌రుగా జారుకుంటున్నార‌న్న వార్త‌లు ఒక‌వైపు, ఇప్ప‌టికే ఇద్ద‌రు స‌భ్యులు రాజీనామాలు చేయడం, పార్టీకి కూడా రాం రాం చెప్పిన నేప‌థ్యంలో వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. శుక్ర‌వారం రాష్ట్రంలో అందు బాటులో ఉన్న రాజ్య‌స‌భ స‌భ్యుల‌ను తాడేప‌ల్లికి ఆహ్వానించి.. వారితో సుదీర్ఘ చ‌ర్చ‌లు జ‌రిపారు. ఈ భేటీకి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్‌చంద్ర‌బోస్ మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. మిగిలిన వారిలో ప‌రిమ‌ళ్ న‌త్వానీ.. దేశంలో లేన‌ని స‌మాచారం అందించ‌గా.. ఆర్. కృష్ణ‌య్య కూడా అందుబాటులో లేనని చెప్పారు. ఇక‌, గొల్ల బాబూరావు ఆరోగ్యం బాగోలేద‌ని రాలేదు. మిగిలిన వారిలో కొంద‌రు.. శ‌నివారం క‌లుస్తామ‌ని స‌మాచారం ఇచ్చారు.

కాగా, ఈ స‌మావేశంలో జ‌గ‌న్ త‌న‌ను తాను త‌గ్గించుకుని మాట్లాడిన‌ట్టు తెలిసింది. పార్టీ ఎంతో దూర‌దృష్టితో ప‌ద‌వులు ఇచ్చిందని.. ఎంతో మంది పోటీలో ఉన్నా.. వారిని కాద‌ని.. సోష‌ల్ ఇంజ‌నీరింగ్‌కు ప‌ట్టం క‌ట్టింద‌ని.. ఈ నేప‌థ్యంలోనే బీసీల‌కు ఎక్కువ‌గా ప్రాధాన్యం ఇచ్చామ‌ని జ‌గ‌న్ చెప్పారు. ఇప్పుడు ప‌ద‌వులు వ‌దిలేసి.. పార్టీని వ‌దిలేసి వెళ్లిపోవ‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌స‌మో చెప్పాల‌ని ప్ర‌శ్నించారు. అయితే.. వెళ్లాల‌నుకునేవారు.. మాత్రం ఒక్క విష‌యం ఆలోచించుకోవాల‌ని సూచించారు. పార్టీ పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని.. బీసీలు పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌డం స‌మంజ‌స‌మేనా? అనేది ఆలోచించుకోవాల‌న్నారు.

టీడీపీకి ఆయుధం!

ప్ర‌స్తుతం వెళ్లిపోతున్న రాజ్య‌స‌భ‌ల ద్వారా.. పార్టీకి ప్ర‌ధాన శ‌త్రువు అయిన‌.. టీడీపీకి మ‌రిన్ని ఆయుధాలు ఇచ్చిన‌ట్టేన‌ని జ‌గ‌న్ చెప్పారు. ప్ర‌స్తుతం టీడీపీకి రాజ్య‌స‌భ‌లో బ‌లం లేద‌ని..ఇప్పుడు ఆ పార్టీలో చేరి.. మ‌రింత బ‌లం పెంచుతారా? అని ప్ర‌శ్నించారు. ఎవ‌రు రాజీనామా చేసినా.. అది టీడీపీ కూట‌మిని బ‌ల‌ప‌ర‌చ‌డ‌మేన‌ని చెప్పుకొచ్చారు. ఇప్ప‌టికే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మ‌నం(వైసీపీ) దెబ్బ‌తిన్నామ‌ని.. ఇప్పుడు ఇలా చేస్తే.. మ‌రింత ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని ఆయ‌న పూస‌గుచ్చిన‌ట్టు వివ‌రించారు. క‌ష్టాలు, న‌ష్టాలు తాత్కాలిక‌మేన‌ని.. మ‌ళ్లీ మ‌నం వ‌స్తామ‌ని ఆయ‌న చెప్పిన‌ట్టు తెలిసింది.

ప్ర‌స్తుతం ఆలోచ‌న చేయాల‌ని.. తొంద‌ర‌పాటు నిర్ణ‌యాలు స‌రికాద‌ని జ‌గ‌న్ సూచించారు. ఈ విష‌యాల‌ను స‌మావేశానికి రాని వారికి కూడా చెప్పాల‌ని సూచించారు. కాగా, ఈ స‌మావేశానికి వ‌చ్చిన పిల్లి సుభాష్ చంద్ర‌బోస్‌.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన‌లోకి వెళ్లిపోతార‌న్న ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఇక‌, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి బీజేపీ బాట ప‌డ‌తార‌ని, ఆయ‌న‌కు ఉన్న కాంట్రాక్టు బిజినెస్‌ల కోసం పార్టీ మారే అవ‌కాశం ఉంద‌ని.. ఈ స‌మావేశం జ‌రుగుతున్న స‌మ‌యంలోనూ సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున చ‌ర్చ సాగ‌డం గ‌మ‌నార్హం.