నామినేటెడ్ ప‌దవుల కుస్తీ.. చంద్ర‌బాబు మెలిక‌.. !

నామినేటెడ్ ప‌ద‌వుల విష‌యంలో కూట‌మి పార్టీల మ‌ధ్య కుస్తీ ప్రారంభ‌మైంది. కూట‌మి ధ‌ర్మానికి క‌ట్టుబడి.. చంద్ర‌బాబు రాష్ట్రంలోని 230కి పైగానామినేటెడ్ ప‌ద‌వుల‌ను భ‌ర్తీ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న కూట‌మి పార్టీల‌కు ఫార్ములా కూడా ప్ర‌క‌టించారు. 8 అసెంబ్లీ, 4 పార్ల‌మెంటు స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకున్న బీజేపీకి 10 శాతం ప‌ద‌వులు, 21 అసెంబ్లీ, 2 పార్ల‌మెంటు స్థానాల‌లో 100 శాతం ఫ‌లితాలు సాధించిన జ‌న‌సేన‌కు 30 శాతం ప‌దవులు ఆఫ‌ర్ చేశారు.

ఇక‌, మిగిలిన 60 శాతం ప‌ద‌వుల‌ను టీడీపీనాయ‌కుల‌కు ఇవ్వాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించుకుని.. ఈ మేరకు ఆయా పార్టీల‌కు స‌మాచారం పంపించి చాలా రోజులు అయింది. అయితే.. జ‌న‌సేన నుంచి ఎలాంటి ఇబ్బంది లేక‌పోయినా.. బీజేపీ నుంచి మాత్రం ఇబ్బందులు తెర‌మీదికి వ‌చ్చాయి. చంద్ర‌బాబు సూచించి న ఈ ఫార్ములాను క‌మ‌ల నాథులు వ్య‌తిరేకిస్తున్నారు. మా వ‌ల్లే రాష్ట్రంలో ప్ర‌భుత్వం ఏర్ప‌డింద‌ని ప‌రోక్షంగా చెబుతున్నారు. మేం లేక‌పోతే.. అంటూ వ్యాఖ్య‌లు కూడా చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో త‌మ‌కు ఫార్ములాతో సంబంధం లేకుండా.. ఎక్కువ ప‌ద‌వులు ఇవ్వాల‌న్న‌ది బీజేపీ నేత‌ల వాద‌న‌. ఈ నేప‌థ్యంలో ఢిల్లీ నుంచి ఏకంగా త‌మ ప్ర‌తినిధిని కూడా ఏపీకి పంపించి.. నామినేటెడ్ ప‌ద‌వుల విష‌యంపై సుదీర్ఘంగా చ‌ర్చించారు. చివ‌ర‌కు త‌మ మ‌న‌సులో మాట‌ను కూడా చంద్ర‌బాబుకు చెప్పేశారు. త‌మ‌కు టీటీడీ స‌హా.. ఆల‌యాల్లో కీల‌క ప‌ద‌వులు కావాల‌ని పేర్కొన్నారు. ఇక‌, ఇత‌ర నామినేటెడ్ ప‌ద‌వుల్లోనూ 25 శాతం ప‌దవులు కావాల‌న్న‌ది వారి డిమాండ్‌.

అయితే.. దీనికి చంద్ర‌బాబు మౌనంగానే స‌మాధాన‌మిస్తూ.. బంతిని వారి కోర్టులోనే ప‌డేశారు. స‌రే.. కేంద్రంలో కూడా నామినేటెడ్ ప‌ద‌వులు ఉన్నాయి క‌దా.. అక్క‌డ మాకు ఎన్ని ఇస్తారో తేల్చండి..! అంటూ తెలివిగా బీజేపీని ఇరుకున ప‌డేవారు. కేంద్రంలో సుమారు 1500 వర‌కు నామినేటెడ్ ప‌ద‌వులు ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు వీటికి సంబంధించి మోడీ స‌ర్కారు ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు. ఈ క్ర‌మంలో ఇక్క‌డ మీరు ఎక్కువ కోరుకుంటే.. అక్క‌డ కూడా మాకు ఎక్కువ కావాల‌ని చంద్ర‌బాబు కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. దీంతో ఇప్పుడు బీజేపీ ఇర‌కాటంలో ప‌డింది. చివ‌ర‌కు ఏం చేస్తారో చూడాలి.