క‌విత‌కు బెయిల్‌.. `ఈ మూడు` కార‌ణాలే క‌లిసి వ‌చ్చాయా?

బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ త‌న‌య‌.. క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణంలో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సుదీర్ఘ నిరీక్ష‌ణ.. అనేక మార్లు బెయిల్ కోసం చేసిన ప్ర‌య‌త్నాలు.. వెర‌సి ఎట్ట‌కేలకు క‌విత‌కు బెయిల్ మంజూరైంది. ఈ ఏడాది మార్చి 15న ఈడీ అధికారులు మ‌ద్యం కుంభ‌కోణంలో రూ.100 కోట్ల లావాదేవీల‌కు సంబంధించి క‌విత‌ను ఆమె నివాసంలోనే అరెస్టు చేసి తీసుకువెళ్లారు. ఈ స‌మ‌యంలో పెద్ద రాజ‌కీయ ఫైట్ కూడా జ‌రిగింది.

ఇక‌, అప్ప‌టి నుంచి జైలు.. బెయిలు అన్న‌ట్టుగా క‌విత ప‌రిస్థితి మారిపోయింది. కుమారుడు చ‌దువుకుంటున్నాడ‌ని.. వాడి బాధ్య‌త తానే చూసుకోవాల్సి ఉంటుంద‌ని ఆమె చెప్పినా.. కోర్టు బెయిల్ ఇవ్వ‌లేదు. ఇక‌, త‌నకు ఇబ్బందిగా ఉంటోద‌ని.. ఎన్నిక‌ల్లో  ప్ర‌చారం చేయాల్సిఉంటుంద‌ని చెప్పినా.. క‌రుణ క‌ల‌గ‌లే దు. కానీ, ఇప్పుడు .. సుప్రీంకోర్టు క‌విత‌కు ఊర‌టనిస్తూ.. తీర్పు మంజూరు చేసింది. దీనిలో ప్ర‌ధానంగా మూడు కార‌ణాలు ప‌నిచేశాయ‌ని సుప్రీంకోర్టు చెప్ప‌డం గ‌మ‌నార్హం.

అంతేకాదు.. ఈ మూడు కార‌ణాల్లో ఒక్క‌టి ఫుల్ ఫిల్ కాక‌పోయినా.. బెయిల్ ఇచ్చేవాళ్లం కాద‌ని సుప్రీం కోర్టు న్యాయ‌మూర్తులు జ‌స్టిస్ బీఆర్ గ‌వాయ్‌, జ‌స్టిస్ విశ్వ‌నాథ‌న్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేసింది. ఈ మూడు కార‌ణాల‌తోనే క‌విత‌కు బెయిల్ ఇస్తున్నామ‌ని తెలిపారు. ఈ నేప‌థ్యంలో ఆ మూడు కార‌ణాల‌పై స‌ర్వ‌త్రా ఆసక్తి రేగింది.

ఇవీ.. కార‌ణాలు..

1) సీబీఐ ఫైన‌ల్ చార్జిషీట్ దాఖ‌లు చేయ‌డం: త‌ద్వారా విచార‌ణ ముగిసింది. సాక్షుల‌ను ప్ర‌భావితం చేసినా.. ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌దు. అంతా ఒక కొలిక్కి వ‌చ్చేసింది. సీబీఐ ఇక‌, విచారించాల్సిన ప‌నికూడా లేదు.

2)  ఈడీ విచార‌ణ పూర్త‌యింది:  మ‌ద్యం కుంభ‌కోణంలో జ‌రిగిన మ‌నీలాండ‌రింగ్‌పై ఈడీ కూడా విచార‌ణ పూర్తి చేసింది. అయితే.. చార్జిషీట్ దాఖ‌లు చేయాల్సి ఉంది. అయిన‌ప్ప‌టికీ.. నిందితులు బ‌య‌ట ఉన్నా.. ఎలాంటి ప్ర‌భావితం చేయ‌లేరు.

3) మ‌హిళా నాయ‌కురాలు:  క‌విత మ‌హిళ‌ కావ‌డం, పైగా ప్ర‌జాప్ర‌తినిధి కావ‌డంతో ఆమెకు ప్ర‌జ‌ల ప‌ట్ల బాధ్య‌త ఉంద‌ని సుప్రీంకోర్టు అభిప్రాయ‌ప‌డింది. అంతా విచార‌ణ అయిపోయిన నేప‌థ్యంలో జైల్లో ఉంచ‌డం స‌మంజ‌సం కాద‌ని తేల్చి చెప్పింది. ఈ మూడు కార‌ణాల‌తోనే క‌విత‌కు బెయిల్ ఇచ్చింది.