విచార‌ణ‌కు పిలిచి కేటీఆర్ కు రాఖీలు క‌ట్టారు..

తెలంగాణ ప్ర‌భుత్వం ఆర్టీసీ బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం క‌ల్పించిన విష‌యం తెలిసిందే. అయితే.. కొంద‌రు మ‌హిళ‌లు బ‌స్సుల్లో పూలు క‌ట్టుకోవ‌డం, జ‌డ‌లు వేసుకోవ‌డం.. అల్లిక‌లు అల్ల‌డం వంటివి చేసి వార్త‌ల్లో నిలిచారు. ఈ ప‌రిణామాల‌ను ఉటంకిస్తూ.. కొన్నాళ్ల కింద‌ట బీఆర్ ఎస్ కార్య‌నిర్వాహ క అధ్య‌క్షుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇక మీద‌ట బ్రేక్ డ్యాన్సులు కూడా చూడాల్సి వ‌స్తుందేమో అని అన్నారు.

ఈ వ్యాఖ్య‌లు వైర‌ల్ అయ్యారు. మ‌హిళ‌ల‌ను కేటీఆర్ కించ‌ప‌రిచారంటూ.. పెద్ద ఎత్తున కాంగ్రెస్ మంత్రు లు, నాయ‌కులు దుమారం రేపారు. మంత్రులు, నాయ‌కులు తీవ్ర విమ‌ర్శ‌లుకూడా చేశారు. వీటిపై అప్ప ట్లోనే కేటీఆర్ వివ‌ర‌ణ ఇచ్చారు. య‌థాలాపంగా అన్న వ్యాఖ్య‌లే త‌ప్ప‌.. మ‌రేమీ లేద‌ని.. మ‌హిళ‌లంటే త‌న‌కు గౌర‌వం ఉంద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. తాను ఉద్దేశ పూర్వ‌కంగా అన‌లేద‌న్నారు. త‌న పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌తో జ‌రిగిన స‌మావేశంలో యాదృచ్ఛికంగానే తాను వ్యాఖ్యానించాన‌న్నారు.

ఇదేస‌మ‌యంలో వ్య‌క్తిగ‌తంగా కూడా ఆయ‌న ఎక్స్‌లో పోస్టు చేశారు. త‌న వ్యాఖ్య‌ల‌తో మ‌హిళ‌ల మ‌నోభావా లు దెబ్బ‌తిని ఉంటే.. సారీ చెబుతున్నాన‌ని తెలిపారు. అయిన‌ప్ప‌టికీ.. తెలంగాణ మ‌హిళా క‌మిష‌న్ కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చింది. మ‌హిళ‌ల‌పై చేసిన వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో నేరుగా క‌మిష‌న్ వ‌ద్ద‌కు వ‌చ్చి విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని ఆదేశించింది. దీంతో శ‌నివారం కేటీఆర్ తెలంగాణ మ‌హిళా క‌మిష‌న్‌కు వ‌చ్చారు. త‌న వాద‌న తాను వినించారు.

మ‌హిళ‌ల కోసం త‌మ ప్ర‌భుత్వం అనేక కార్య‌క్ర‌మాలు చేసింద‌ని.. మ‌హిళ‌లంటే త‌మ‌కు ఎన‌లేని గౌర‌వ మని కూడా చెప్పారు. తాను ఏదో అల‌వాటులో పొర‌పాటుగా చేసిన వ్యాఖ్య‌లను వెన‌క్కి తీసుకుని విచారం కూడా తెలిపాన‌ని చెప్పారు. ఆ వివ‌రాలున‌మోదు చేసుకున్న క‌మిష‌న్ స‌భ్యులు కేటీఆర్ వివ‌ర‌ణ‌తో సంతృప్తి చెందిన‌ట్టు తెలిసింది. ఇదిలావుంటే.. విచార‌ణ ముగిసి బ‌య‌ట‌కు వస్తున్న స‌మ‌యంలో కేటీఆర్‌కు తెలంగాణ మ‌హిళా క‌మిష‌న్‌లోని స‌భ్యులు వ‌రుస పెట్టి రాఖీలు క‌ట్ట‌డం గ‌మ‌నార్హం.

దీంతో కేటీఆర్ స‌హా.. ఆయ‌న వెంట ఉన్న మాజీ మంత్రులు, ఇత‌ర నాయ‌కులు ఆశ్చ‌ర్య‌పోయారు. మ‌రోవైపు.. మహిళా క‌మిష‌న్ ముందు.. బీఆర్ ఎస్‌, కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు పోటాపోటీ నిర‌స‌న‌ల‌తో అట్టుడికించారు.