ఏ నాయకుడైనా తన నియోజకవర్గంలో బలమైన చెరగని ముద్ర వేయాలని భావిస్తారు. అందుకే ఎన్ని ప్రయాసలు పడినా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలోనూ నియోజకవర్గంలో తన పేరు నిలిచిపోయేలా వ్యవహరిస్తారు. పనులు కూడా చేపడతారు. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని కూడా అలాగే తపించారు. అలాగే పని చేశారు. 2014, 2019 ఎన్నికల్లో వరుస విజయాలు దక్కించుకున్న నాని విజయవాడకు సంబంధించి పలు ప్రాజెక్టులు తీసుకురావడంలోనూ అదే విధంగా గ్రామీణ ప్రాంతాలను టాటా వారి ట్రస్ట్ తో అభివృద్ధి చేయడంలోనూ ఆయన ముందున్నారు.
అదేవిధంగా నాని అంటే అవినీతిపరుడు కాదు అని నిజాయితీగా పని చేస్తారని పేరు కూడా తెచ్చుకున్నారు. వాస్తవానికి ఆయన ఎక్కడా అవినీతి చేసినట్టుగాని ఎవరి దగ్గర రూపాయి లంచం తీసుకున్నట్టుగా కానీ వార్తలు వచ్చింది లేదు. ఆరోపణలు వచ్చింది కూడా ఎప్పుడు జరగలేదు. మరి అలాంటి నాయకుడు అకస్మాత్తుగా రాజకీయాలకు దూరం కావడం తన పనిలో తాను నిమగ్నం కావడంతో ఇప్పుడు విజయవాడ లో అసలు నాని అన్న పేరు కూడా ఎక్కడా వినిపించకుండా పోయింది.
ఒక్కొక్కసారి నాయకులు రాజకీయాలకు దూరమైనా వారి పేరు మాత్రం నియోజకవర్గంలో నిలిచిపోతుంది. ఉదాహరణకు రాయపాటి సాంబశివరావు, కావూరి సాంబశివరావు అదేవిధంగా దివంగత పర్వతనేని ఉపేంద్ర వంటి నాయకులు పేర్లు ఎప్పటికీ ప్రజల్లో వినిపిస్తూనే ఉంటాయి. దీనికి కారణం వారు అలా రాజకీయాలను మలుచుకున్నారు. తమకు అనుకూలంగా కార్యకర్తలను తయారు చేసుకున్నారు. కానీ నాని విషయానికి వచ్చేసరికి మాత్రం ఆయనకంటూ పట్టుమని ఒక వంద మంది కార్యకర్తలు కూడా లేకపోవడం గమనార్హం.
టిడిపిలో ఉన్న కార్యకర్తలని ఆయన తన వారిగా భావించారు సొంతంగా ఆయనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకోలేకపోయారు. ఒక పరిధిని గీసుకొని అందులోనే ఉండిపోవడంతో ప్రత్యేకంగా నాని వర్గంగా ఎవరూ లేకపోవడం నాని మనుషులుగా ఎవరు గుర్తింపు తెచ్చుకోకపోవడంతో ఇప్పుడు నాని పేరు ఎక్కడా అసలు వినిపించని పరిస్థితి ఏర్పడింది. పదవులు, గెలుపు నాయకులకు శాశ్వతం కాకపోయినా రాజకీయాల్లో ఉన్నవారికి పేరు అనేది శాశ్వతంగా ఉండాలి. ఈ విషయంలో ముందు బాగానే పనిచేసినప్పటికీ కేశినేని నాని పేరు ఇప్పుడు నియోజకవర్గంలో వినిపించకుండా పోవడం ఆయన చేసుకున్న రాజకీయాలేనని విజయవాడ ప్రజలు అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates