ఏపీలో బ్రాండెడ్ లిక్క‌ర్.. క్వార్ట‌ర్ 110

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత నాణ్య‌మైన మ‌ద్యాన్ని అందుబాటులోకి తీసుకువ‌స్తామ‌ని ఎన్నిక‌ల‌కు ముందు చంద్రబాబు హామీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ హామీ మేర‌కు.. అక్టోబ‌రు 1వ తేదీ నుంచి నూత‌న మ‌ద్యం పాల‌సీని అందు బాటులోకి తీసుకువ‌చ్చేందుకు కూట‌మి స‌ర్కారు రెడీ అయింది. దీనికి సంబంధించి తెలంగాణ‌, కేర‌ళ‌, క‌ర్ణాట‌క స‌హా త‌మిళ‌నాడు రాష్ట్రాల్లో మంత్రుల బృందం ప‌ర్య‌టించి.. ప‌రిశీలించింది. అక్క‌డ అమ‌ల‌వుతున్న మ‌ద్యం విధానానికి సంబంధించి చంద్ర‌బాబుకు నివేదిక కూడా అందించింది. దీనిలో ప‌లు విష‌యాల‌ను వారు వివ‌రించారు. ధ‌ర‌లు, అమ‌లు వంటివి కూడా ఉన్నాయి.

దీని ప్ర‌కారం.. క్వార్ట‌ర్ నాణ్య‌మైన మ‌ద్యాన్ని రూ.110 లోపు అందించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన‌ట్టు తెలిసింది. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. మ‌రోవైపు.. ప్ర‌ముఖ బ్రాండ్ల కంపెనీల‌ను కూడా రాష్ట్రానికి ఆహ్వానించాల‌ని నిర్ణ‌యించారు. ఇక్క‌డే డిస్టిలరీల‌ను ఏర్పాటు చేసుకుని నాన్ ఫారిన్ లిక్క‌ర్ కంపెనీల‌ను ఏపీలో ఏర్పాటు చేసుకునేందుకు ఉన్న అవ‌కాశాల‌ను కూడా ప‌రిశీలించ‌నున్నారు. వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక‌.. ప్ర‌భుత్వ‌మే లిక్క‌ర్ వ్యాపారాన్ని స్వాధీనం చేసుకుంది. వైన్స్‌ను ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తూ.. బార్ల‌ను మాత్రం ప్రైవేటుకు ఇచ్చింది.

అయితే.. ఈ విధానంలో నాణ్య‌మైన మ‌ద్యాన్ని ప‌క్క‌న పెట్టి చీపు లిక్క‌ర్ విక్ర‌యించార‌ని..త‌ద్వారా వినియోగ‌దారుల‌ ఆరోగ్యం చెడిపోయింద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలోనే మద్యం పాలసీపై కసరత్తు చేసి.. తాజాగా ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలిసింది. ఈ కొత్త మద్యం పాలసీ అమల్లోకి వస్తే, మద్యం ధరలు భారీగా తగ్గనున్నాయని మంత్రులు తెలిపారు. గ‌త‌ మద్యం పాలసీని రద్దు చేసి, 2014-19 మ‌ధ్య టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన పాత మద్యం పాలసీని అమలు చేయనున్న‌ట్టు చెప్పారు.

ఈ క్ర‌మంలో తక్కువ ధరలకే నాణ్యమైన మద్యం అందించేలా చర్యలు చేపడతామ‌ని, క్వార్టర్ బాటిల్ రూ.110 లోపే ఉండేలని భావిస్తున్న‌ట్టు తెలిపారు. ఈ నేప‌థ్యంలో ఆయా కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్టు చెప్పారు. ఇదే స‌మ‌యంలో ఔట్ లెట్ల‌ను పెంచాల‌ని కూడా నిర్ణ‌యించారు. ధ‌ర‌లు త‌గ్గిస్తున్నందున స‌రుకును ఎక్కువ‌గా విక్ర‌యించి ఆదాయం త‌గ్గ‌కుండా చూసుకోవాల‌న్న‌ది ప్ర‌భుత్వ ఆలోచ‌న‌ల‌గా ఉందని తెలుస్తోంది. మొత్తంగా అక్టోబ‌రు 1వ తేదీ నుంచి నూత‌న మ‌ద్యం పాల‌సీని అమ‌ల్లోకి తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నం వేగంగా జ‌రుగుతోంది.