ఒక్క నెలలో ముగ్గురు మంత్రులు బుక్ అయ్యారు

సీఎం జగన్ ఏపీలో పగ్గాలు చేపట్టి 15 నెలలు గడిచాయి. అయితే, ఈ 15 నెలల పాలనలో మొదటి 14నెలలు ఒక ఎత్తు….15వ నెల ఒక ఎత్తు అని చెప్పవచ్చు. పాలన చేపట్టి ఏడాది గడిచేలోపే ఇసుక కొరత, కరోనాతో పాటు జగన్ కు కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి. వాటిని ఎలాగోలా మేనేజ్ చేస్తున్న జగన్ కు గత నెల రోజుల కాలంలో ఎదురైన సవాళ్లు బాగానే ఇబ్బంది పెట్టాయి.

అంతర్వేదితో పాటు ఏపీలోని ఆలయాల్లో జరుగుతున్న ఘటనల నేపథ్యంలో దేవాదయ శాఖా మంత్రి వెల్లంపల్లి వ్యవహారం జగన్ కు ఇబ్బందిగా మారింది. ఇక, అవినీతిరహిత ప్రభుత్వం నడుపుతానని చెప్పిన జగన్ ను బెంజికారు వ్యవహారంతో మంత్రి గుమ్మనూరు జయరాం ఇరకాటంలో పెట్టారు. ఇక, తాజాగా తిరుమల డిక్లరేషన్ వ్యవహారంలో ప్రధాని మోడీ పేరును లాగిన మంత్రి కొడాలి నాని….జాతీయ స్థాయిలో జగన్ ను ఇబ్బందిపెట్టారు. ఈ రకంగా ఒక్క నెలలోనే ముగ్గురు మంత్రులు ఏపీ ప్రభుత్వాన్ని తద్వారా జగన్ ను ఇరకాటంలో పెట్టారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది.

ఏపీలోని దేవాలయాలు, వాటికి సంబంధించిన ఆస్తులు, చారిత్రక కట్టడాలు, వస్తువుల ధ్వంసం ఘటనలు తీవ్ర కలకలం రేపాయి. ఈ వ్యవహారంలో దేవాదయ శాఖా మంత్రి స్పందించినా…అప్పటికే బీజేపీ, టీడీపీ, జనసేనలు ప్రభుత్వంపై బురదజల్లాయి. ఇక, అంతర్వేదిలో దగ్ధమైన రథాన్ని చూసేందుకు వెళ్లిన వెల్లంపల్లికి చేదు అనుభవం ఎదురుకావడం, అక్కడ పరిస్థితిని అంచనా వేయడంలో ఫెయిల్ కావడం వంటి వ్యవహారాల నేపథ్యంలో జగన్ సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ వ్యవహారం సద్దుమణగక ముందే మంత్రి గుమ్మనూరు జయరాం తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. జయరాం స్వగ్రామం గుమ్మనూరులో ఆయన సోదరుడి పేకాట క్లబ్ పై రైైడింగ్ జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఆ క్లబ్ తన సోదరుడిది కాదని మంత్రి జయరాం ఖండించారు. జయరాం కుమారుడికి ఈఎస్ఐ స్కాం నిందితుడు కార్తీక్ బెంజి కారు కొనిచ్చారన్న ఆరోపణలు కలకలం రేపాయి.

మంత్రి సిఫార్సుల ప్రకారమే 14వ నిందితుడిగా కార్తీక్ పేరు ఏసీబీ చేర్చిందని టీడీపీ ఆరోపిస్తుంది. దీంతో, ఈ వ్యవహారంపై సీరియస్ గా ఉన్న జగన్….పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత చర్యలు తీసుకోవాలన్న యోచనలో ఉన్నారట. ఇక, తాజాగా డిక్లరేషన్ వివాదంలో నాని వ్యాఖ్యలలపై విపక్షాలతోపాటు హిందు సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

అయితే, ఈ వివాదంలోకి ఏకంగా మోడీని లాగడంతో తిరుమల డిక్లరేషన్ వ్యవహారం జాతీయ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో, నాని పై కూడా జగన్ గరంగరంగా ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ ను డిఫెండ్ చేయబోయిన నాని….జగనే స్వయంగా డిఫెన్స్ లో పడేలా చేశారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈరకంగా ఒక నెల కాలంలోనే జగన్ ను, ప్రభుత్వాన్ని ముగ్గురు మంత్రులు ఇరకాటంలో పెట్టారన్న టాక్ వస్తోంది.ఒక నెలలోనే ముగ్గురు మంత్రులు బుక్ అయ్యారని అనుకుంటున్నారు.