ఢిల్లీ ట్రిప్: బాబు ఫోకస్ మొత్తం నిధుల మీదే!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. బుధవారం ఆయన దేశ రాజధానికి వెళుతున్నారు. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఈ పర్యటనలో భాగంగా కలిసే కేంద్ర మంత్రులందరితోనూ.. రాష్ట్రానికి అవసరమైన నిధులను తీసుకురావటమే లక్ష్యమని చెబుతున్నారు.

కేంద్రం నుంచి రావాల్సిన నిధులు.. ఏఏ ప్రాజెక్టు.. స్కీంల కింద కేంద్రం నుంచి రావాల్సిన వాటి వివరాల్ని సేకరించి.. సంబంధిత శాఖా మంత్రులతో భేటీ కావటం.. వీలైనంత త్వరగా నిధులను విడుదల చేయాల్సిందిగా కోరనున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఆయన మంత్రులతో భేటీ అయ్యారు. కేంద్రం నుంచి రాబట్టాల్సిన నిధులకు సంబంధించిన ఒక ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వివరించి.. రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు వీలైనన్ని ఎక్కువ నిధులు సేకరించేలా ప్రణాళికల్ని సిద్ధం చేయించారు. తాజా పర్యటనలో సీఎం చంద్రబాబు కలవనున్న కేంద్ర మంత్రుల జాబితాలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, సీఆర్ పాటిల్ తో పాటు మరికొందరు మంత్రులతోనూ భేటీ కానున్నారు. చంద్రబాబు వెంట వెళ్లే ఏపీ మంత్రుల్లో బీసీ జనార్దన్.. నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ తదితరులు వెళ్లనున్నారు. కేంద్రంలో ఎన్డీయే సర్కారు వచ్చేందుకు కీలకభూమిక పోషించిన చంద్రబాబు తన తాజా పర్యటనతో ఏపీకి ఏమేరకు వరాల్ని పొందుతారన్నది ఇప్పుడు ఆసక్తకరంగా మారింది.