రోజాకు అంత భయమేల?

అసలే ఎన్నికల్లో ఘోర పరాజయం తాలూకు అవమాన భారంతో ఉన్నారు జగన్ అండ్ కో. ఇప్పుడేమో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా రుషికొండ మీద ఏకంగా రూ.550 కోట్ల ఖర్చుతో జగన్ కుటుంబం కోసం విలాసవంతంగా నిర్మించుకున్న భవనాల వ్యవహారంతో వైసీపీ పరువు పోతోంది. జాతీయ స్థాయిలో ఈ అంశం చర్చనీయాంశంగా మారుతోంది.

అధికారంలో ఉండగా జగన్, అమర్‌నాథ్ లాంటి మంత్రులు.. అవి సీఎం కోసం నియమిస్తున్న భవనాలని నొక్కి వక్కాణించారు. కానీ ఇప్పుడేమో అవి ప్రభుత్వ భవనాలని, టూరిజం కోసమని, అతిథుల కోసం కట్టారని మాట మారుస్తున్నారు. తాజాగా రోజా ఈ వ్యవహారంపై ట్విట్టర్ పోస్టు కూడా పెట్టింది. కానీ ఆమెను కౌంటర్ చేద్దామని చూస్తున్న నెటిజన్లకు కామెంట్లు పెట్టే అవకాశం మాత్రం లేకపోయింది.

ఎన్నికలు అయిన దగ్గర్నుంచి రోజా తన కామెంట్ బాక్స్‌ను క్లోజ్ చేసి పెట్టేసింది. తన పోస్టులకు ఎవ్వరూ స్పందించే అవకాశం లేకుండా చేసింది. తన పట్ల జనాల్లో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో రోజాకు బాగానే అర్థమైనట్లుంది. అందుకే తన ఏ పోస్టుకూ ఎవ్వరూ కామెంట్ చేయలేని విధంగా చూసుకుంది. నిజంగా తన వాదనలో, తన పోస్టుల్లో నిజం ఉందని అనిపిస్తే.. దాని మీద ఎవ్వరైనా కౌంటర్లు వేసినా సమాధానం చెప్పుకోగలగాలి. కానీ కేవలం తన వెర్షన్ మాత్రం వినిపించి.. ఎవ్వరూ దానికి సమాధానం చెప్పలేని విధంగా చేసుకోవడం అంటే వాదనలో పస లేనట్లే కదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

రోజా మాత్రమే కాదు.. వైసీపీకి భజన చేయడం ద్వారా జనాల్లో తీవ్ర వ్యతిరేకత తెచ్చుకున్న కోన వెంకట్ లాంటి వైసీపీ మద్దతుదారులు సైతం కామెంట్ బాక్స్ క్లోజ్ చేసి పోస్టులు పెడుతుండడం గమనార్హం.