Political News

రామోజీ గురించి చాలామందికి తెలీని 5 అంశాలు

చెరుకూరి రామోజీరావు అన్నంతనే కాస్త కొత్తగా అనిపిస్తుంది కానీ రామోజీరావు అంటే చప్పుడు గుర్తుకు వస్తారు. పేరును బ్రాండ్ గా మార్చటం తెలుగు నేలలో రామోజీతోనే మొదలైందని చెప్పాలి. అంతేకాదు.. తన పేరుతో ఒక విశ్వసనీయతను సాధించటం అదీ వ్యాపార రంగంలో అంటే మాటలు కాదు.

రామోజీ ప్రత్యేకత ఏమంటే వ్యాపారంలోనే కాదు.. వ్యవహారాల్లోనూ ఆయన విశ్వసనీయతకు కేరాఫ్ అడ్రస్. అలాంటి ఆయన గురించి చాలామంది చాలా మాట్లాడుకుంటారు. కానీ.. ఆయన గురించి చెప్పే మాటల్లో నిజాల కంటే అబద్ధాలే ఎక్కువగా ఉంటాయి. అసలు ఆయన ఎలా ఆలోచిస్తారు? ఆయన నిర్ణయాలు ఎలా ఉంటాయి? అన్న అంశాల్ని లోతుగా చూస్తే ఎవరికి తెలియని రామోజీ కనిపిస్తారు.

ఇన్నిమాటలు చెబుతున్నావు? నీవెవరు? నీకు ఆయన గురించి ఎవరికి తెలియని విషయాలు ఎలా తెలుసు? లాంటి ప్రశ్నలు దీన్ని చదవే వారికి కలగటం ఖాయం. ఈనాడు సంస్థలో సుదీర్ఘ కాలంపాటు పని చేయటంతో పాటు.. సంస్థ యాజమాన్య స్థాయిలో పని చేయటంతో పాటు.. యాజమాన్యం తీసుకున్న పలు నిర్ణయాల్ని అమలులో కీలకంగా వ్యవహరించిన అనుభవం మాత్రం ఉంది.

ఈ కారణంగా ఛైర్మన్ గారి (ఈనాడు సంస్థల్లో పని చేసే ఏ ఉద్యోగి అయినా ఆయన్ను అలానే పిలుస్తారు. పేరుతో ప్రస్తావించరు. అది భయంతో కాదు గౌరవంతో. దాన్ని ఎవరూ నేర్పరు. ఆ సంస్థలో చేరినంతనే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఎందుకంటే ఛైర్మన్ గారి వ్యక్తిత్వం అలాంటిది) గురించి చాలామందికి తెలిని కొన్ని నిజాల్ని లోకానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది.

అప్పుడే ఆయన గొప్పతనం.. ఆయన వాల్యూ సిస్టం తెలిసే వీలుంది. ఈనాడులో పని చేసి.. అత్యున్నత స్థానాల్లోకి వెళ్లి ఆ తర్వాత సంస్థను.. ఛైర్మన్ గారిని తిట్టటం చూస్తాం. ఎందుకలా? అన్న ప్రశ్నను ఎన్నోసార్లు వేసుకునే వాడిని. నావరకు నాకు అర్థమైందేమంటే.. వ్యక్తిగత స్వార్థం తప్పించి మరేమీ ఉండదు. ఈనాడు సంస్థల్లో ఎదగటానికి కావాల్సింది కులం ఎంత మాత్రం కాదు. పని చేసే తత్త్వం. ప్రతిభ. కష్టించే మనస్తత్వం. అలా చేసుకుంటూ పోతే.. సంస్థలో ఏ మూలన ఉన్న సరే.. గుర్తించి మరీ తీసుకెళ్లి అందలం ఎక్కించేల రామోజీరావు వ్యవస్థను సెట్ చేశారు. అదీ ఆయన గొప్పతనం.

అందరికి తెలిసిన తెలుగు ప్రముఖుల్నే తీసుకుందాం. ఇప్పుడు చెప్పే వారంతా కూడా ఈ తరానికి ఇప్పటి వారికి ఇట్టే అర్థమయ్యే పేర్లు. ఈ కారణంగా కాస్తంత వింతగా ఉండొచ్చు కానీ.. వారంతా రామోజీ స్కూల్లో సాదాసీదా జీవితాన్ని షురూ చేసి.. వ్యవస్థల్ని శాసించే స్థాయికి చేరుకున్నారు.

సజ్జల రామక్రిష్ణారెడ్డి.. కురసాల కన్నబాబు.. కొమ్మినేని శ్రీనివాసరావు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది జర్నలిస్టులు తర్వాతి కాలంలో రాజకీయనాయకులుగా.. రాజకీయ రంగంలో కీలక స్థానాలకు చేరుకున్న వారే. వీరంతా ఈనాడు బడిలో రామోజీరావు సెట్ చేసిన వ్యవస్థలో పని చేసి.. తమను తాము మెరుగుపర్చుకున్నవారే. అలా వ్యక్తుల్ని శక్తులుగా మార్చటం రామోజీకి అలవాటు.

ఆయన జీవితానికి సంబంధించి తెలిసిన విషయాల కంటే తెలియని విషయాలే అత్యధికం. ఆ మాటకు వస్తే.. ఆయన జీవితంలో చోటు చేసుకున్న ఘటనలు.. ఆయన తీసుకున్న నిర్ణయాలతో చోటు చేసుకున్న పరిణామాలను కథలుగా మార్చి సినిమాలు తీస్తే తక్కువలో తక్కువ యాభై సినిమాలు తీయొచ్చు. అంత పెద్దది రామోజీ జీవితం. అలాంటి వ్యక్తి గురించి ఐదు తెలియని అంశాలు ఇప్పుడు చెబుతా.

వైఎస్ పాదయాత్ర

రామోజీరావు అన్నా.. ఈనాడు అన్నా చంద్రబాబుకు తొత్తులని.. ఈనాడు చెప్పిందే తెలుగుదేశం పార్టీ వింటుందని.. తెలుగుదేశం ప్రయోజనాలు తప్పించి ఇంకేమీ పట్టవమన్న మాటలు చాలానే వింటారు. అయితే.. అది పూర్తి వాస్తవం కాదు. అందులో నిజం ఎంతన్నది చాలా తక్కువ మందికి తెలుసు. ఇప్పుడు పరిస్థితులు మారాయి కానీ ఐదేళ్ల క్రితం వరకు పరిస్థితి మరోలా ఉండేవి. కాంగ్రెస్ నేతగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు.. ఆయన పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్న పరిస్థితి. ఇలాంటి వేళ రాజకీయంగా వ్యతిరేకించే వైఎస్ పాదయాత్రను ఎలా కవర్ చేయాలన్న దానిపై తర్జనభర్జనలు పడే పరిస్థితి. ధీని విషయంలో ఎడిటోరియల్ విభాగం వారికి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. మొత్తంగా ధైర్యం కూడదీసుకొని వైఎస్ పాదయాత్ర కవరేజ్ మాట గురించి అడిగితే.. రామోజీరావు నోటి నుంచి వచ్చిన మాట.. ప్రజలు అంతలా అభిమానిస్తే మనం ఎందుకు వార్తలు ఇవ్వకూడదు. మనం ప్రజల పక్షాన ఉందాం. వారి ఆకాంక్షలకు వ్యతిరేకంగా పని చేయటానికి మనకేం హక్కు ఉందని ప్రశ్నించారు. దీన్ని చదివినోళ్లు చాలామంది నమ్మరు. కానీ.. ఇది నిజం. కావాలంటే ఈనాడులో అత్యున్నత స్థాయిలో పని చేసిన వారితో క్రాస్ చెక్ చేసుకోండి.

వైఎస్ మరణం వేళ..

ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు ఏపీ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డికి మధ్య ఎంతటి శత్రుత్వం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత.. ప్రభుత్వ వ్యతిరేకంగా వార్తలు రాయొద్దని వైఎస్ నుంచి వినతులు.. మీకేం కావాలన్నా తాము చేస్తామని చెప్పినా రామోజీ వినలేదు. ప్రజల పక్షాన ఉంటాం. ప్రజాసమస్యల్ని ఎత్తి చూపకపోతే ఎలా? అన్నదే ఆయన వాదన. ప్రభుత్వం చేసే తప్పుల గురించి ప్రశ్నించకుండా ఎలా ఉంటాం? అన్నది ఆయన వేదన.
అలా భావవైరుధ్యంతో మొదలైన పోరు అంతకంతకూ పెరిగి పెద్దదై ఎంతవరకు వెళ్లిందో అందరికి తెలుసు. వ్యక్తిగతంగా తన ఇమేజ్ ను డ్యామేజ్ చేయటంతో పాటు.. తమకు చెందిన మార్గదర్శి ఇష్యూలో ఆర్థికంగా దెబ్బ తీసినప్పటికీ రామోజీ బెదర్లేదు. వైఎస్ ఏం చేసుకుంటారో చేసుకోవాలన్నారే కానీ రాజీకి వచ్చింది లేదు. ఉప్పు.. నిప్పులా ఉన్న వేళలో.. అనూహ్య రీతిలో వైఎస్ ప్రమాదంలో చనిపోవటం తెలిసిందే. వైఎస్ మరణించిన వేళ.. ఆయన భౌతికకాయాన్ని సందర్శించేందుకు రామోజీ సిద్ధమైనప్పుడు కొందరు వారించారు. సార్.. మీరు వెళితే.. అన్న అనుమానాల్ని వ్యక్తం చేశారు.

ఆయన మంచి మనిషి అయ్యా.. వ్యక్తిగతంగా ఆయనకు నాకు ఏం వైరం ఉంది. ఆయన కుటుంబం ఇప్పుడు ఎంతో శోకంలో ఉంది. పరామర్శించటం నా ధర్మం. ఎవరేం అనుకున్నా నేను పట్టించుకోను.. అంటూ ఫిలింసిటీ నుంచి సిటీకి వచ్చి వెళ్లారు. వైఎస్ ఇంటికి వెళ్లి వచ్చిన తర్వాత గెస్టు హౌస్ లో విశ్రాంతి తీసుకుంటున్న వేళలో.. ఎడిటోరియల్ కు సంబంధించిన కీలకమైన వారంతా ఆయనతో సమావేశం అయ్యారు. అందరిలోనూ ఒక ధర్మసంకటం ఎదురైంది. వైఎస్ మరణవార్తకు సంబంధించిన కవరేజ్ ఎలా ఉండాలి? ఛైర్మన్ గారి మనసు ఏమిటో తెలుసుకుంటే.. దాని ప్రకారం ముందుకు వెళ్లాలని భావించారు.అలా అని ఆయన్ను నేరుగా అడిగే ధైర్యం ఎవరికి లేదు.
చివరకు నసుగుతూ.. ఎన్ని పేజీలు వైఎస్ మరణవార్తకు కేటాయిస్తే బాగుంటుందన్న ప్రశ్న వేస్తే.. అందరివంక చూస్తూ.. ఆయన మరణం పెద్ద విషాదం. కోట్లాది మంది వేదన చూశారుగా. ప్రజల పక్షానే మనం. అంత పెద్ద ప్రజానాయకుడికి వీడ్కోలు ఘనంగా ఉండాలి. ఎవరికి ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. మీ పని మీరు చేయండన్న మాట రావటం.. ఆ తర్వాతి రోజు వచ్చిన ఈనాడు దినపత్రిక ముందు సాక్షి పత్రిక చిన్నపోయిన పరిస్థితి. అంతేనా.. ఆ రోజున ఈనాడు దినపత్రికలో మొదటి పేజీలో వేసి లైఫ్ సైజ్ వైఎస్ ఫోటోను సాక్షి వారు తర్వాతి రోజుల్లో రిక్వెస్టు చేసి ఒరిజినల్ కాపీని తీసుకోవటం జరిగింది.

బట్టలు విప్పదీసిన జగన్ ను సైతం..

ఈనాడు రామోజీ వర్సెస్ వైఎస్ ఫ్యామిలీ మధ్య నడిచిన వైరం గురించి తెలుగు నేలలో తెలియని వారు ఉండరు. వీరి మధ్య ఉన్న వైరంలో భాగంగా రామోజీ తప్పుల్ని ఎత్తి చూపుతూ.. ఆయన బట్టలు విప్పదీసిన కార్టూన్లను సాక్షిలో ప్రచురించారే తప్పించి.. ఏ రోజూ ఈనాడులో అలాంటివి చేయలేదు. దీనికి కారణం.. మనకంటూ ఒక పద్దతి ఉంది. దాన్ని మించిపోవద్దంటూ ఎప్పటికప్పుడు చెప్పేవారు. ఆవేశానికి లోనయ్యే వారిని.. ఆ తీరు తప్పంటూ సర్దేవారు. అలా అని వైఎస్ ఫ్యామిలీ మీద ఆయనకు ఆగ్రహం లేదని చెప్పట్లేదు. కానీ.. అదంతా ధర్మాగ్రహం. తాను నమ్మిన సిద్ధాంతానికి భిన్నంగా జరుగుతున్న అంశాల మీద ఆయన పోరు తప్పించి.. వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలన్న భావన ఉండదు.
ఇటీవల కాలంలో మరీ ముఖ్యంగా ఒకట్రెండు సంవత్సరాల నుంచి.. తనను ఎట్టి పరిస్థితుల్లో అరెస్టు చేయాలని.. తన కోడల్ని మార్గదర్శి ఎపిసోడ్ లో అరెస్టు చేసే అంశంపై జరిగిన పరిణామాలకు మాత్రం ఆయన బాగా డిస్ట్రబ్ కావటం జరిగిందని చెబుతారు. ఈ కారణంతోనే.. ఈనాడు రాతల్లో గతంలో ఎప్పుడూ లేనంత మార్పు వచ్చిందని చెప్పాలి. తనను బట్టల్లేకుండా ఉండే క్యారికేచర్ ను భారీ ఎత్తున సాక్షి పత్రికల్లో పదే పదే ప్రచురించినప్పటికీ.. దాన్ని రామోజీకి మనసుకు ఎక్కువగా తీసుకోలేదని చెబుతారు.
విపక్ష నేతగా ఉండి.. తనను కలవాలని భావించిన జగన్ కు సాదరంగా ఆహ్వానించటమేకాదు.. తన వద్దకు వచ్చిన జగన్ తో దాదాపు రెండున్నర గంటల వరకు సమయాన్ని వెచ్చించటం.. ఆ సందర్భంగా మర్యాదలకు ఎలాంటి లోటు లేకుండా జాగ్రత్తలు తీసుకోవటం రామోజీకే చెల్లిందని చెప్పాలి.

టైం అంటే టైం

ఒకసారి టైం ఫిక్స్ అయ్యాక.. ఏం జరిగినా సరే చెప్పిన సమయానికి ఒక నిమిషం ముందు ఉండటం రామోజీకి అలవాటు. ఎవరికైనా టైం ఇస్తే..ఎన్ని పనులు ఉన్నా.. ఆ టైంకు వారిని కలుస్తారే తప్పించి.. వెయిట్ చేయించటం ఇష్టం ఉండదు. అంతేకాదు.. ఆయన తన ఉద్యోగులకు సౌకర్యాల్ని కల్పించే విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటారు. జీతాలు భారీగా ఇవ్వరు కానీ సౌకర్యవంతమైన జీవితాన్ని గడిపేందుకు అవసరమైన డబ్బులు మాత్రం ఇచ్చే అలవాటు ఉంటుంది. క్రమశిక్షణకు పెద్ద పీట వేసే రామోజీ.. ఈ విషయంలో మాత్రం ఆయన చాలా కఠినంగా వ్యవహరిస్తారు.

నా ఫోటోలు ఎందుకు?

ఒక పవర్ ఫుల్ మీడియా హౌస్ ను నడిపే క్రమంలో తమ ఇమేజ్ ను అంతకంతకూ పెంచుకోవాలని.. అందులో భాగంగా తమ మీడియాలో తమను ఎక్కువగా ఫోకస్ చేయాలన్న తాపత్రయం చాలామంది యజమానులు ప్రదర్శిస్తుంటారు. ఈ విషయంలో రామోజీ రావు చాలా తేడా. చివరి పదేళ్లలో మార్పులు వచ్చాయి కానీ.. మొదట్లోనూ.. ఆ తర్వాత కూడా తనకు సంబంధించిన.. తన కుటుంబానికి సంబంధించిన వార్తల విషయంలో ఆయన చాలా స్పష్టంగా ఉండేవారు. తాము పాల్గొన్న ప్రోగ్రాంలకు సంబంధించిన వార్తను వేసే క్రమంలో ఫోటో పెద్దదిగా వేసినా తర్వాతి రోజు అక్షింతలు ఖాయం. మొదట్లో అయితే.. తమ ఫోటోలు వేయాల్సిన అవసరమే లేదని తేల్చేశారు. పేపరు కొనేది మా ఫోటోలు.. వార్తలు చూడటానికి కాదు.. ప్రజలకు అవసరమైన వార్తలు వేయాలని చెప్పేవారు. అందుకే.. ఏదైనా కార్యక్రమంలో ఛైర్మన్ గారు పాల్గొన్నారంటే ఆయన ఫోటో వేయాలంటే వేయలేని పరిస్థితి. అనవసర ప్రచారం వద్దన్నది ఆయన సిద్ధాంతాం.

డబ్బులు కాదు వార్తలే ముఖ్యం

రామోజీరావు చాలానే వ్యాపారాలు చేసినా ఈనాడు దినపత్రిక అంటే ఆయనకు ప్రాణం. ఆ పత్రికను నడిపే విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకునే వారు. దేశంలో మరే మీడియా సంస్థలో కనిపించని ఎన్నో అంశాల్ని పాటించే వారు. రెవెన్యూ కోసం కాస్త తగ్గేందుకు వెనుకాడని మీడియా సంస్థలు బోలెడు. కానీ.. రామోజీ అలా కాదు. రెవెన్యూ కోసం వార్తల విషయంలో రాజీ పడటం సాధ్యం కాదని తేల్చేవారు. పదేళ్ల నుంచి కొంత మారారు కానీ.. మొదట్లో అయితే..ఒక పేజీకి ఎంత ప్రకటనలు ఉండాలన్న దానికి నియమం పెట్టుకొని.. దానికి కట్టుబడి ఉండేవారు. తాను అనుకున్న పరిమితికి మించి కోట్లాది రూపాయిలు ప్రకటనల సొమ్ముగా ఇస్తామన్నా.. ఆ స్పేస్ ను ఇచ్చేవారు కాదు. అందులో వార్తలు మాత్రమే ఉండాలనే వారు. ఇక.. ఈనాడు సంస్థలు ఎన్ని విభాగాలు ఉన్నప్పటికీ.. ఎడిటోరియల్ విభాగానికే పెద్దపీట. వారి మాటకే ఆయన విలువ ఇచ్చే వారు. సంస్థకు రెవెన్యూ తెచ్చే ప్రకటనల విభాగం తమ ప్రాధాన్యత గురించి చెప్పే ప్రయత్నం చేస్తే ఆయన నోటి నుంచి వచ్చేది ఒక్కటే మాట.. ఎడిటోరియల్ సిబ్బంది వార్తలు రాయకపోతే.. నీకు విలువెక్కడిదయ్యా? నీవెన్ని డబ్బులు ప్రకటనలతో తెచ్చినా.. వారురాసిన వార్తల కారణంగానే నీకు ప్రకటనలు ఇస్తున్నారు. నిన్ను చూసి ఇవ్వట్లేదు. ఎడిటోరియల్ రాసిన వార్తల్ని చూసి ఇస్తున్నారంటూ స్పష్టంగా చెప్పేశారు. ఇలాంటి తీరును రామోజీలో ఉంటుందని ఎంతమందికి తెలుసు?

  • ఈనాడు మాజీ ఉద్యోగి

Share
Show comments
Published by
Satya

Recent Posts

విశాల్ ప్రభావం – 30 సినిమాల బూజు దులపాలి

పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…

3 minutes ago

అఖండ 2 ఇంటర్వల్ కే మీకు పైసా వసూల్ : తమన్

ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…

1 hour ago

మాకు సలహాలు ఇవ్వండి బిల్ గేట్స్‌కు చంద్ర‌బాబు ఆహ్వానం

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఐటీ దిగ్గ‌జ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు,…

2 hours ago

శార‌దా ‘స్వామి’ తిరుమల లో చేసింది తప్పే

విశాఖ‌ప‌ట్నంలోని శార‌దాపీఠం అధిప‌తి స్వ‌రూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్ర‌చారంలో ఉన్న విష‌యం తెలిసిందే. వైసీపీ హ‌యాంలో ఆయ‌న చుట్టూ…

2 hours ago

రిలయన్స్ న్యూ కరెన్సీ.. జియో కాయిన్

ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…

2 hours ago

ఎన్నాళ్లకెన్నాళ్లకు?… గల్లా రీయాక్టివేట్ అయినట్టేనా?

గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…

3 hours ago