151 కన్నా ఎక్కువ స్థానాలు గెలుస్తాం..ఐ-ప్యాక్ తో జగన్

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం సీఎం జగన్ తొలిసారి బయటకు వచ్చారు. విజయవాడలోని ఐ-ప్యాక్ ఆఫీసును జగన్ సందర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి వ్యూహకర్తగా వ్యవహరించిన ఐ-ప్యాక్ సంస్థ ప్రతినిధులతో జగన్ చిట్ చాట్ నిర్వహించారు. వైసీపీ గెలుపు కోసం కృషి చేసిన బృందానికి జగన్ కృతజ్ఞతలు చెప్పారు. ఈ సందర్భంగా ఎన్నికల ఫలితాలపై జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో 151 ఎమ్మెల్యేలు, 22 ఎంపీలు గెలిచామని, ఈ సారి అంతకన్నా ఎక్కువ స్థానాలు సాధించబోతున్నామని జోస్యం చెప్పారు.

ప్రజలకు సుపరిపాలన అందించామని, అందుకే, అఖండ మెజారిటీతో విజయం సాధించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీకి ఉన్న హవా కన్నా 2024 ఎన్నికలకు ముందు ఉన్న హవా ఎక్కువని, భారీ మెజారిటీ సాధించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని ఐ-ప్యాక్ సభ్యులతో జగన్ అన్నారు. ఐ-ప్యాక్ టీమ్ ను ఉద్దేశించి జగన్ మాట్లాడుతున్న సందర్భంగా ఐ-ప్యాక్ హెడ్ రిషీ సింగ్ కూడా పక్కనే ఉన్నారు. ఈ సారి 151,22 కన్నా ఎక్కువ స్థానాలు గెలుస్తామని జగన్ ధీమా వ్యక్తం చేయగా…అందుకు ఐ-ప్యాక్ టీం సభ్యులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

2019 ఎన్నికలకు ముందు ఐ-ప్యాక్ హెడ్ గా ఉంటూ జగన్ గెలుపులో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే ఈ సారి జగన్ ఓటమి తప్పదని బల్లగుద్ది మరీ చెబుతున్న సంగతి తెలిసిందే. మరి, 2024 ఏపీ ఎన్నికల ఫలితాల విషయంలో జగన్, పీకేలలో ఎవరి జోస్యం నిజం కాబోతోంది అన్నది తేలాలంటే జూన్ 4వ తేదీ వరకు వేచి ఉండక తప్పదు.