ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నా కొద్దీ పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. అభ్యర్థులు గెలుపోటములపై బేరీజు వేసుకుంటూ ఓట్ల వేటలో సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలోని అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో పోరు ఆసక్తికరంగా మారింది. ఇక్కడ కాంగ్రెస్ గెలిచేందుకు అవకాశాలు ఎక్కువగా ఉండటమే అందుకు కారణమని చెప్పాలి. గతంలో ఇక్కడి నుంచి రెండు సార్లు గెలిచిన మాజీ మంత్రి శైలజానాథ్ మరోసారి కాంగ్రెస్ నుంచి విజయదుందుభి మోగించాలనే పట్టుదలతో ఉన్నారు.
శింగనమల నియోజకవర్గంపై శైలజనాథ్‌కు మంచి పట్టుంది. 2004, 2009 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ విజయాలు సాధించారు. కానీ 2014, 2019లో ఓడిపోయారు. ఉమ్మడి ఏపీ విభజన కారణంగా ఏపీలో కాంగ్రెస్‌పై వ్యతిరేకత పెరిగిపోవడం శైలజానాథ్‌కు చేటు చేసింది. కానీ ఈ సారి మాత్రం ఆయన గెలవాలనే లక్ష్యంతో సాగుతున్నారు. అధికార వైసీపీపై వ్యతిరేకతే ప్రధాన ఆయుధంగా చేసుకుని, గతంలో నియోజకవర్గంలో తాను చేసిన మంచి పనులను వివరిస్తూ ప్రచారంలో శైలజానాథ్ సాగిపోతున్నారు.
ఇక్కడ శైలజానాథ్‌కు వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులు, టీడీపీ నుంచి పోటీ చేస్తున్న బండారు శ్రావణితో గట్టి పోటీ ఉంది. ఇక్కడ వైసీపీ సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న జొన్నలగడ్డ పద్మావతి మరోసారి గెలిచే అవకాశం లేదని అభ్యర్థిని జగన్ మార్చేందుకు సిద్ధమయ్యారు. కానీ పద్మావతి భర్త సాంబశివారెడ్డి పట్టుబట్టి మరీ తన వద్ద టిప్పర్ డ్రైవర్‌గా పనిచేసే వీరాంజనేయులుకు టికెట్ ఇప్పించుకోవడం గమనార్హం. ఇప్పటికే పద్మావతిపై వ్యతిరేకతతో ఉన్న ఆ పార్టీ నాయకులు ఇప్పుడు అసలే సపోర్ట్ చేయడం లేదని తెలిసింది. ఇక టీడీపీ నాయకురాలు బండారు శ్రావణి కూడా గెలుపు కోసం గట్టిగా కృషి చేస్తున్నారు. ఆమెకూ గెలిచే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates