ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌పై ఆయన సోదరి, కాంగ్రెస్ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. “ప్రత్యేక మోదా కోసం.. గత ఎన్నికలకు ముందు మూకుమ్మడి రాజీనామాలు చేయాలన్న జగన్ పిలుపు పెద్దడ్రామా” అని పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువచ్చే విషయంలో జగన్.. నాటకాలాడారని విమర్శించారు. స్పెషల్ స్టేటస్ కోసం మూకుమ్మడి రాజీనామాలు అని చెప్పి డ్రామాలాడారని దుయ్యబట్టారు. వైసీపీ తరపున గెలుపొందిన 22 మంది ఎంపీలు పార్లమెంట్ లో ఒక్క రోజు కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్ల పాటు స్పెషల్ స్టేటస్ ఇస్తామని షర్మిల పేర్కొన్నారు. దీనిపైనే రాహుల్ గాంధీ ఫస్ట్ సంతకం చేస్తారన్నారు. ఈ ప్రభుత్వానికి ఏపీ ప్రయోజనాలు పట్టడం లేదని దుయ్యబట్టారు. జగన్ ప్రభుత్వంలో ఏడు సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచారని షర్మిల విమర్శించారు. విజయవాడలోని ఓ కన్వెన్షన్ సెంటర్ లో కాంగ్రెస్ నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ సీఎం జగన్ తీరుపై నిప్పులు చెరిగారు. బీజేపీకి తెరచాటున అమ్ముడు పోయారని అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాలను జగన్ తాకట్టు పెట్టారని షర్మిల దుయ్యబట్టారు.
కాంగ్రెస్ పెద్దలతో ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాపై సోమవారం స్పష్టత వస్తుందని షర్మిల చెప్పారు. ఆ రోజే ఢిల్లీ నుంచి కాంగ్రెస్ పార్టీ ఏపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నట్టు తెలిపారు. కాగా, ఏపీలో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన జాబితా సిద్ధమయినట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు 1,500 దరఖాస్తులు వచ్చినట్టు షర్మిల వెల్లడించారు. అభ్యర్థుల పనితీరుపై సర్వే చేయించి తుది జాబితాను ప్రకటిస్తామని చెప్పారు. అయితే.. టికెట్ వచ్చినా.. రాకున్నా.. పార్టీకోసం పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు. పార్టీని నిలబెట్టుకుంటే.. తర్వాత పదవులు అవే వస్తాయన్నారు.