ప్రకాశం రాజకీయాల్లో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్టయిలే వేరు. ఆయన ఎక్కువగా మాట్లాడరు. పని మాత్రమే చేస్తారనే పేరుంది. గతంలో ఆయన ఓటమి పాలైనప్పుడు.. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఈమాటే వినిపించేది. నాయకులు కూడా ఆయనను గౌరవించడం వెనుక ఈ ఫార్ములానే కీలకంగా నడిచిందనే వాదన ఉంది.
అయితే, ఇప్పుడు ఆయన మంత్రి అయ్యారు. పైగా ప్రకాశం రాజకీయాల్లో ఒకప్పుడు రెండు కేంద్రాలుగా నడిచిన వైసీపీ రాజకీయాల్లో ఇప్పుడు బాలినేని సెంట్రిక్‌గానే అన్నీ సాగుతున్నాయి. మరి ఇప్పుడు ఆయన పేరు మరింత పెరగాలి. ఆయన హవా మరింత దూకుడగా మారాలి.
కానీ, అదే జరుగుతోందా? ఇప్పుడు ఇక్కడి నాయకులు సంతృప్తిగానే ఉన్నారా? బాలినేని బ్రహ్మరథం పడుతున్నారా? అంటే.. లేదనే అంటున్నారు పరిశీలకులు. రాజకీయాల్లో బాలినేని చాలా సీనియర్. గతంలో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈయన ఓడిపోయారు. అదేసమయంలో ఒంగోలు ఎంపీగా సీఎం జగన్ చిన్నాన్న.. వైవీ సుబ్బారెడ్డి విజయం సాధించారు. దీంతో అటు బాలినేని, ఇటు వైవీలు జిల్లా రాజకీయాలను పంచుకున్నారనే టాక్ ఉండేది.
బాలినేనిని వ్యతిరేకించే వర్గాన్ని, అనుకూలంగా ఉన్న వర్గాన్ని కూడా వైవీ ఆదరించేవారని.. అయితే, వారు తాను ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలనే కండిషన్ మాత్రం పెట్టేవారని అప్పట్లో చెప్పుకొనేవారు. పైగా ఎంపీగా ఉన్న నేపథ్యంలో సదరు నేతలకు ఆయన పనులు కూడా చేసిపెట్టేవారట.
ఇక, ఇప్పుడు బాలినేని ఒక్కరే జిల్లాలో కీలక నాయకుడిగా ఉన్నారు. మంత్రిగా మరో నేత ఆదిమూలపు సురేష్ ఉన్నప్పటికీ.. ఆయన ఎప్పుడూ.. రాజకీయంగా దూకుడు చూపించింది కానీ, వ్యూహాత్మకంగా వ్యవహరించింది కానీ, గ్రూపు రాజకీయాలు చేసింది కానీలేదు. ఇక, వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్‌గా ఉండడంతో దాదాపు ఆయన ప్రకాశం రాజకీయాల్లో వేలు పెట్టడం లేదు. దీంతో నాయకులు అందరూ కూడా ఏ అవసరం వచ్చినా.. బాలినేని ఇంటికే క్యూకడుతున్నారు. కానీ, ఇప్పుడు బాలినేని ఈ నేతలకు అందని ద్రాక్షగా మారారని అంటున్నారు.
తనవద్దకు వచ్చిన నేతల గతాన్ని తవ్వితీసి.. నువ్వు నాకు అప్పుడు వ్యతిరేకంగా మాట్లాడావు.. నువ్వు అప్పుడు నా వర్గంలో లేవు.. అంటూ.. వారికి కనీసం అప్పాయింట్‌మెంట్ ఇచ్చేందుకు కూడా అంగీకరించడం లేదని వైసీపీలోనే చర్చ జోరుగా సాగుతోంది. దీంతో బాలినేని వ్యవహారం.. నివురు గప్పిన నిప్పులాగా మారిందని ప్రచారం జరుగుతోంది.
మేం.. ఏవర్గంలోనూ లేం. పార్టీ కోసం పనిచేశాం. అయినా మాకు పనులు కావడం లేదు. మంత్రి గారు మమ్మల్ని పట్టించుకోవడం లేదు
-అని ఇటీవల ప్రకాశం జిల్లా పొలిటికల్ ఇంచార్జ్‌గా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డికి ఇదే సామాజిక వర్గానికి చెందిన కొందరు నాయకులు మొరపెట్టుకున్న పరిస్థితి జిల్లాలో బాలినేని పరిస్థితిని స్పష్టం చేస్తోందని అంటున్నారు పరిశీలకులు. మరి ఇదే పరిస్థితి కొనసాగితే.. పార్టీకి నష్టం కాదా? అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. మరి అటు జగన్, ఇటు సజ్జల ఏం చేస్తారో.. చూడాలి.