మాయావతి తనపై ఒత్తిడి తెచ్చారు: ప్ర‌వీణ్‌కుమార్

మాజీ ఐపీఎస్ అధికారి, బీఎస్సీ తెలంగాణ ఇంచార్జ్ పదవికి ఆదివారం రాజీనామా చేసిన‌ ఆర్‌. ఎస్. ప్ర‌వీణ్‌కుమార్ తాజాగా బీఆర్ ఎస్ గూటికి చేరారు. ఎర్ర‌వ‌ల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ ఫాం హౌస్‌లో ఆయ‌న కారెక్కారు. కేసీఆర్ స్వ‌యంగా ఆయ‌న‌కు కండువా క‌ప్పి.. పార్టీలోకి ఆహ్వానించారు. అయితే.. ఈ సంద‌ర్భంగా ప్ర‌వీణ్‌.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, బ‌హుజ‌న స‌మాజ్ వాదీ పార్టీ అధినేత్రి మాయావ‌తిపై ఆయ‌న నిప్పులు చెరిగారు. త‌న‌ను న‌మ్మించి ఆమె మోసం చేశార‌ని వ్యాఖ్యానించారు. “పార్టీ ఇక్క‌డ లేదు. అయినా.. ఇల్లిల్లూ తిరిగి బీఎస్పీని ఒక ప్ర‌ధాన పార్టీగా మార్చా. చివ‌ర‌కు నామాట‌కే విలువ లేకుండా పోయింది” అని ప్ర‌వీణ్ ఆక్రోశం వ్య‌క్తం చేశారు.

బీఆర్ఎస్ పార్టీతో పొత్తును రద్దు చేసుకోవాలని మాయావతి తనపై ఒత్తిడి తెచ్చారని ప్ర‌వీణ్ వెల్ల‌డించారు. కానీ, అప్ప‌టికే అన్ని చ‌ర్చ‌లు జ‌రిగిపోవ‌డం, పెద్దాయ‌న‌కు(కేసీఆర్‌) మాటిచ్చి ఉండ‌డం.. ప్ర‌జ‌ల‌కు కూడా క‌లిసి పోటీ చేస్తామ‌ని చెప్ప‌డం అయిపోయాయ‌ని.. ఇంత జ‌రిగిన త‌ర్వాత పొత్తు ర‌ద్దు చేసుకోవ‌డం అంటే.. ప్ర‌జ‌లు విశ్వ‌సించ‌ర‌ని తాను అభిప్రాయ‌ప‌డిన‌ట్టు ప్ర‌వీణ్ వెల్ల‌డించారు. అందుకే ఆ పార్టీని వీడినట్లు తెలిపారు. ప్రవీణ్ కుమార్ జై బీమ్… జై తెలంగాణ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేశారని, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రానికి బలమైన పునాది వేశారన్నారు. మనకు అవకాశమిచ్చి తెలంగాణలో కేసీఆర్ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారన్నారు.

కేసీఆర్ లాగే తాను కూడా మాట ఇస్తే తప్పనన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని తెలిపారు. బలమైన తెలంగాణ వాదానికి బహుజన వాదం కలిస్తే బాగుంటుందని లోక్ సభ ఎన్నికల కోసం పొత్తు కుదుర్చుకున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్‌తో పొత్తు రద్దు చేసుకోవాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి తనపై ఒత్తిడి తెచ్చారన్నారు. అయితే, ఇది తనకు ఇష్టం లేదని, అందుకే బీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తో పాటు పలువురు బీఎస్పీ నాయ‌కులు, మ‌ద్ద‌తుదారులు, అభిమానులు భారీ సంఖ్య‌లో కేసీఆర్ స‌మ‌క్షంలో కారెక్కారు.

ఆర్ ఎస్ ప్ర‌వీణ్‌.. బీఆర్ ఎస్ త‌ర‌ఫునే నాగ‌ర్‌క‌ర్నూలు ఎస్సీ పార్ల‌మెంటు స్థానం నుంచి పోటీ చేసే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే బీఎస్పీకి కేసీఆర్ ఈ టికెట్ను కేటాయించారు. అయితే.. పొత్తు ర‌ద్ద‌యింది. అయిన‌ప్ప‌టికీ ప్ర‌వీణ్ బీఆర్ ఎస్‌లో చేర‌డంతో ఆయ‌న‌కే ఈ టికెట్ కేటాయించనున్న‌ట్టు బీఆర్ ఎస్ వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌రోవైపు ప్ర‌ధాని మోడీ, బీజేపీ ఒత్తిడి కార‌ణంగానే బీఆర్ ఎస్‌తో బీఎస్పీ చేతులు క‌ల‌ప‌లేద‌నే టాక్ రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.