పవన్ కళ్యాణ్ హైద్రాబాద్‌లో వుంటారు.. ఆయన నాన్ లోకల్… ఈ ప్రచారం వైసీపీ నుంచి గట్టిగా జరుగుతోంది పిఠాపురం నియోజకవర్గంలో. కాపు సామాజిక వర్గం, దాంతోపాటు పిఠాపురంలో ఓట్ల పరంగా ప్రభావం చూపగల మరికొన్ని సామాజిక వర్గాల్లో కొందర్ని, జనసేనకు వ్యతిరేకంగా మార్చేందుకు అధికార వైసీపీ.. రాత్రికి రాత్రికి చిత్ర విచిత్రమైన వ్యవహారాలు నడుపుతోంది.
నిజానికి, పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచే పోటీ చేస్తారని వైసీపీకి ఏనాడో ఉప్పందింది. ఈ క్రమంలోనే గతంలో జనసేన పార్టీలో పని చేసిన వంగా గీతని కాకినాడ లోక్ సభ నుంచి పిఠాపురం అసెంబ్లీకి మార్చింది వైసీపీ. అప్పట్లో వంగా గీత, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచనలకు అనుగుణంగా పని చేశారు. అయితే, అప్పుడు పవన్ కళ్యాణ్, యువరాజ్యం అధినేత. అది ప్రజా రాజ్యం పార్టీ యూత్ వింగ్.
వంగా గీత వర్సెస్ పవన్ కళ్యాణ్.. ఈ ఈక్వేషన్, పిఠాపురం సాధారణ ప్రజల్లో ఇంట్రెస్టింగ్ చర్చకు తెరలేపింది. వంగా గీతకు స్థానికంగా మంచి ఇమేజ్ వుందన్నది నిర్వివాదాంశం. అయితే, వైసీపీ పట్ల స్థానికంగా వున్న వ్యతిరేకత, వంగా గీతకి మైనస్ అవ్వొచ్చన్నది ఇప్పటికిప్పుడు అక్కడ వున్న పరిస్థితి.
అయితే, టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ అనూహ్యంగా ఎదురు తిరిగారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి. మిత్రపక్షం అన్న కనీసపాటి ఇంగితం లేకుండా, తన అనుచరుల్ని వర్మ రెచ్చగొట్టి వదలడాన్ని టీడీపీ కూడా జీర్ణించుకోలేకపోతోంది.
వర్మ మెత్త బడే పరిస్థితి కనిపించడంలేదు. ఆయన అనుచరులు మరింత అగ్రెసివ్‌గా వున్నారు. వర్మ మాత్రమే కాదు, ఆయన అనుచరులూ.. వైసీపీతో టచ్‌లోకి వెళ్ళిన విషయం స్థానికంగా అందరికీ తెలుసు. అయితే, వర్మ ఇంపాక్ట్ పిఠాపురంలో ఎంత.? అన్నదే ప్రస్తుతానికి సస్పెన్స్.
‘పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే, ఆయన్ని గెలిపించే బాద్యత నాది. గెలుపుని బంగారు పళ్ళెంలో పెట్టి పవన్ కళ్యాణ్‌కి ఇస్తా. పవన్ కళ్యాణ్ ప్రచారానికి కూడా రావాల్సిన అవసరం లేదు..’ అని గతంలో ఇదే వర్మ చెప్పి, ఇప్పుడు మాట మార్చడం మరో ఆసక్తికరమైన విషయం.
ఎలా చూసినా, స్థానికంగా ఈక్వేషన్స్ అన్నీ జనసేనానికి అనుకూలంగా వున్నాయి. అయితే, వంగా గీతకు వున్న క్లీన్ ఇమేజ్ కారణంగా, జనసేనానికి పిఠాపురంలో గట్టి పోటీ అధికార వైసీపీ నుంచి తప్పకపోవచ్చు.