పిఠాపురం.. ఏపీలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. రెండు రకాలుగా ఈ నియోజకవర్గంపై చర్చ సాగుతోంది. ఒకటి.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్న మిలియన్ డాలర్ల ప్రశ్నకు పిఠాపురం సమాధానం చెప్పింది. వచ్చే ఎన్నికల్లో తాను ఇక్కడ నుంచే పోటీ చేస్తానని పవన్ ప్రకటించారు. దీంతో ఆయన పోటీ చేసే స్థానంపై జనసైనికులు.. పవన్ అభిమానులకు క్లారిటీ వచ్చేసింది. ఇక, రెండోది.. పవన్ ప్రకటన తర్వాత.. పిఠాపురంలో రేగిన అలజడి.
పిఠాపురం టికెట్ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు అనుసరించిన తీరును దుయ్యబడుతూ. ఇక్కడి వారు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు పేరుతో ఉన్న బ్యానర్లు, కటౌట్లను తగల బెట్టారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతేకాదు.. ఎవరిని అడిగి టికెట్ పవన్‌కు ఇచ్చారని కూడా నిలదీశారు. మరోవైపు పవన్ పోటీ చేసినా .. ఆయనను ఓడిస్తామన్నారు. మొత్తానికి ఈ వ్యవహారం తో పిఠాపురం రెండు రకాలుగా చర్చకు వచ్చింది.
పిఠాపురం టీడీపీ నాయకుడు ఎస్‌వీఎస్ ఎన్ వర్మ పేరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగింది. దీంతో వర్మ ఎవరు? ఎప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు? ఆయనకు టీడీపీకి సంబంధం ఎంత బలంగా ఉంది? ఆయనకు నిజంగానే అన్యాయం చేస్తున్నారా? అనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ విషయాన్ని పరిశీలిస్తే.. సత్యనారాయణ వర్మ.. 2009 ఎన్నికలకు ముందే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత.. పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు.
ఈ క్రమంలో 2014లో వర్మ ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచారు. ఏకంగా 47వేల ఓట్ల మెజారిటీతో విజయం దక్కించుకున్నారు. దీంతో చంద్రబాబు ఆయనను మరోసారి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ క్రమంలోనే 2019 టికెట్ ఇచ్చారు. అయితే.. వైసీపీ నేత పెండెం దొరబాబుపై వర్మ ఓడిపోయారు. అప్పటి నుంచి పార్టీలో పెద్దగా యాక్టివ్‌గా లేరు. ఆయనకు సంబంధించి సర్వే చేయించిన చంద్రబాబు ఈ సీటును జనసేనకు కేటాయించారు. దీనిని వ్యతిరేకిస్తూ.. వర్మ వర్గీయులు హడావుడి చేశారు. వాస్తవానికి వర్మది వాపే కానీ.. బలుపు కాదనేది స్థానికంగా వినిపిస్తున్న మాట.
Gulte Telugu Telugu Political and Movie News Updates