వైసీపీ కీలక నాయకుడు, బీసీ సామాజిక వర్గానికి చెందిన కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ తాజాగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. అయితే, ఈయనకు మరలా క ర్నూలు ఎంపీ సీటునే ఇస్తారా? లేక వేరే ఏదైనా ఇస్తారా? అనేది తేలాల్సి ఉంది. వైసీపీలో 2019లో కర్నూలు నుంచివిజయం దక్కించుకున్న సంజీవ్‌కుమార్ సౌమ్యుడిగా ముద్రపడ్డారు. ఉన్నత విద్యావంతుడు, నిగర్వి కూడా కావడంతో ప్రజలకు ఆయనంటే అభిమానం మెండుగానే ఉంది.
అయితే, వివిద సర్వేల్లో సంజీవ్ కు వ్యతిరేకంగా ఫలితం వచ్చిందని భావించిన వైసీపీ వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ లేదని తేల్చి చెప్పింది. దీంతో నెల రోజుల కిందటే ఆయన వైసీపీకి రాజీనామా సమర్పిం చారు. ఈ క్రమంలో టీడీపీ ఆయనకు టచ్‌లోకి వెళ్లింది. తాజాగా టీడీపీలో ఆయన చేరిపోయారు. ఈ సందర్భంగా సంజీవ్ కుమార్ మాట్లాడుతు.. తనకు ఎలాంటి అవకాశం ఇచ్చినా పని చేస్తానని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారాల్సిన అవసరం ఉందన్నారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమిని ప్రజలు ఆదరించేందుకు రెడీగా ఉన్నారని తెలిపారు. వైసీపీ పాలనలో ఎక్కడా అభివృద్ధి లేదన్నారు. తాను ఎప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడినా.. రాజకీయా లు నీకు తెలియవంటూ అవమానించారని సంజీవ్ కుమార్ వ్యాఖ్యానించారు. మరి రాజకీయాలు తెలియని వాడిని ఎందుకు ఎంపీ టికెట్ ఇచ్చారో వారే సమాధానం చెప్పాలని అన్నారు. తన నియోజకవర్గానికి ఎంపీ లాడ్స్ కేటాయించి అభివృద్ధి పనులు చేసుకుంటే కూడా అడ్డు పడ్డారని తెలిపారు.
చంద్రబాబు మాట్లాడుతూ.. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసమే పొత్తులు పెట్టుకున్నామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంలోని బీజేపీ సహకారం అవసరమని వ్యాఖ్యానించారు. వైసీపీ మాదిరిగా తాము లోపాయికారీ పొత్తులుతో ముందుకు సాగి.. ప్రజలను మోసం చేయడం లేదని.. నేరుగానే పొత్తులు పెట్టుకున్నామని చెప్పారు. ప్రజలు కూడా పొత్తులను స్వాగతిస్తున్నారని చంద్రబాబు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తాము ఘన విజయం సాధిస్తామన్నారు.