మేడిగడ్డ బ్యారేజి సమస్యను చాలా చిన్నదిగా చూపించేందుకు బీఆర్ఎస్ నానా అవస్థలు పడుతోంది. శుక్రవారం నాడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ నాయకత్వంలో సుమారు 200 మంది నేతలు, ఇంజనీరింగ్ నిపుణులు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించిన విషయం తెలిసిందే. మేడిగడ్డ బ్యారేజి తర్వాత సుందిళ్ళ, అన్నారం ప్రాజెక్టులను కూడా కేటీయార్ బృందం పరిశీలించింది. కేటీయార్ బృందం పరిశీలనలోనే కుంగిన పిల్లర్లతో పాటు పగుళ్ళిచ్చిన బ్యారేజి గోడలు కనబడ్డాయి. ఆ పగుళ్ళు కూడా చిన్నవిగా కాదు పెద్దవిగానే కనిపించాయి.
దాన్ని ఎలా సమర్ధించాలో అర్ధంకాక హరీష్ రావు, కేటీయార్ అండ్ కో మేడిగడ్డ సమస్య చిన్నదే అన్నారు. సమస్యలకు రిపేర్లు చేసే అవకాశాలు ఉన్నాయన్నారు. నిపుణుల సలహాలు తీసుకుని రిపేర్లకు వెంటనే ప్రభుత్వం ప్రయత్నించాలని డిమాండ్ చేశారు. వరదలు వచ్చేలోగానే మరమ్మత్తులు పూర్తిచేయాలని సూచించారు. సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఆలోచించకుండా రాజకీయం చేయటం దురదృష్టమని హరీష్, కేటీయార్ మండిపోయారు. కాంగ్రెస్ ది బాధ్యత గల ప్రభుత్వం అయితే యుద్ధ ప్రాతిపదికన మేడిగడ్డ రిపేర్లను మొదలుపెట్టాలని డిమాండ్ చేయటం విచిత్రంగా ఉంది.
ఇప్పటికే కేంద్రం జలవనరుల శాఖ నిపుణుల బృందం, రాష్ట్రంలోని ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారుల బృందం బ్యారేజిని పరిశీలించిన విషయం తెలిసిందే. వీళ్ళు తేల్చింది ఏమిటంటే మేడిగడ్డ బ్యారేజి నీటినిల్వకు పనికిరాదని. కుంగిపోయిన పిల్లర్లకు రిపేర్లు చేయించినా పెద్దగా ఉపయోగముండదని అబిప్రాయపడ్డారు. మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాజెక్టుల రూపంలో కేసీయార్ వేలాది కోట్లరూపాయల అవినీతికి పాల్పడ్డారని రేవంత్ రెడ్డి, మంత్రులు పదేపదే ఆరోపిస్తున్నారు.
నిపుణుల బృందం అభిప్రాయాలు కూడా వాళ్ళ ఆరోపణలకు మద్దతిచ్చేవిగానే ఉన్నాయి. అందుకనే కేసీయార్ పై అవినీతి ఆరోపణలను తిప్పికొట్టేందుకు కేటీయార్, హరీష్ కు పెద్దగా అవకాశం దొరకలేదు. అందుకనే ప్రాజెక్టులను సమర్ధించలేక ప్రభుత్వంపై ఎదురుదాడులకు దిగుతున్నారు. కళ్ళముండే కుంగిపోయినపిల్లర్లు, పగుళ్ళిచ్చిన బ్యారేజీ గోడలు కనిపిస్తున్నా ఇంకా తమ చర్యలను హరీష్ ,కేటీయార్ సమర్ధించుకోవటం ఏమిటని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపోతున్నారు. ఇదే విషయాన్ని మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతు మేడిగడ్డ బ్యారేజి ఇక పనికిరాదని నిపుణులు అభిప్రాయపడ్డారని ప్రకటించటం గమనార్హం.