బీజేపీ నేతలే నవ్వుకుంటున్నారా ?

రాజకీయ నేతల మాటల్లో నిజాలకన్నా అబద్ధాలే ఎక్కువుంటాయని అందరికీ తెలిసిందే. జనాలను ఆకర్షించేందుకు నోటికొచ్చిందేదో మాట్లాడేసి అప్పటికి పని పూర్తయిందనిపించుకుంటారు. ఇపుడిదంతా ఎందుకంటే కేంద్రమంత్రి రాజ్ నాధ్ సింగ్ మాటలగురించే. విషయం ఏమిటంటే ఏలూరులో పార్టీ మీటింగుకు రాజ్ నాథ్ హాజరయ్యారు. ఆయన ఏమన్నారంటే రాబోయే ఎన్నికల్లో ఏపీలో కూడా బీజేపీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందన్నారు. ఏపీలో పార్టీ బాగా పుంజుకుని శక్తివంతంగా తయారైందని కేంద్రమంత్రి చెప్పారు. మంత్రి చెప్పిన మాటలు విన్న నేతలంతా తెగ నవ్వుకుంటున్నారట.

క్షేత్రస్ధాయిలో పార్టీ పరిస్ధితి ఒకలాగుంటే కేంద్రమంత్రి మాత్రం అందుకు విరుద్ధంగా మాట్లాడటాన్ని నేతలు ఫుల్లుగా ఎంజాయ్ చేశారట. అంటే కేంద్రమంత్రి అబద్ధాలన్నా చెప్పుండాలి లేదా మంత్రికి పార్టీ పరిస్ధితిపై రాంగ్ ఫీడ్ బ్యాకన్నా ఇచ్చుండాలన్న విషయం కమలనాదులకు బాగా అర్ధమైపోయింది. వాస్తవం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రావటం కాదు కదా ఒంటరిగా పోటీచేస్తే ఒక్క అభ్యర్ధికి కనీసం డిపాజిట్టు కూడా రాదు. పోయిన ఎన్నికల్లో బీజేపీకి వచ్చినే ఓట్లశాతం 0.56 శాతం. అంటే ఒక్కశాతం ఓట్లు కూడా తెచ్చుకోలేకపోయింది.

నోటాకు వచ్చిన ఓట్లు 3 శాతం అని అందరికీ తెలిసిందే. ఇక వైజాగ్ ఎంపీగా పోటీచేసిన రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి డిపాజిట్ కూడా రాలేదు. రాబోయే ఎన్నికల్లో కూడా సేమ్ సీన్ రిపీటవుతుందనటంలో సందేహంలేదు. కాకపోతే అయోధ్యలో రామమందిరం నిర్మాణం తర్వాత జనాల్లో బీజేపీ వైపు మొగ్గు పెరుగుతోందనే టాక్ వినబడుతోంది. అది ఎంతవరకు నిజమో ఎన్నికల ఫలితాల్లో కాని తెలీదు.

బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వస్తుందన్న మంత్రి మాటలను తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రీపోల్ సర్వేలన్నీ ఇదే విషయాన్ని చెబుతున్నాయి కాబట్టి. కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి రావచ్చు కాని ఏపీలో మాత్రం పార్టీ పరిస్ధితి అధ్వాన్నంగానే ఉంది. ఎందుకంటే ఇంతకుముందు అధ్యక్షులుగా, పార్టీ బాధ్యులుగా ఉన్న వారంతా పార్టీ ఎదుగులను నాశనం చేసేశారు. వ్యక్తిగతంగా వాళ్ళు ఎదిగి పార్టీని లేవనీయకుండా దెబ్బకొట్టేశారు. కాబట్టి రాజ్ నాథ్ సింగ్ కాదు కదా స్వయంగా నరేంద్రమోడి కూడా ఏపీలో బీజేపీని బలోపేతం చేయలేరన్నది వాస్తవం.