అమరావతిలో ఏ ముహూర్తంలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ నిర్మించారో తెలీదు కానీ అప్పటి నుండి వాస్తు మార్పులు చేయిస్తునే ఉన్నారు. తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీని చంద్రబాబునాయుడు హయాంలో నిర్మించారు. అయితే అప్పట్లోనే భవనాలకు అనేక చోట్ల మార్పులు, చేర్పులు చేశారు.
ఎవరైనా తాముంటున్న ఇంటికి వాస్తు మార్పులు చేయించటంలో అర్ధముంది. ఎందుకంటే తాము నివసిస్తున్న ఇంటికి వాస్తు సరిగా లేకపోతే దాని ప్రభావం తమ భవిష్యత్తుపై పడుతుందన్న భావనతోనే మార్పులు చేయిస్తారు. అయితే ఇక్కడ కార్యాలయాలకు కూడా వాస్తు మార్పులు చేయిస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది.
ఆశ్చర్యం ఎందుకంటే అన్నీ రకాలుగా వాస్తు వ్యవహారాలు చూసుకునే చంద్రబాబు అప్పట్లో నిర్మాణాలు చేయించారు. తాత్కాలిక భవనాల నిర్మాణాలకు ముందే వాస్తు పండితులు అనేకసార్లు సచివాలయం, అసెంబ్లీ భవనాలను నిర్మించిన స్ధలాన్ని పరిశీలించారు. తర్వాత భవనాల కాంట్రాక్టర్లతో కూడా భేటి అయి వాస్తు గురించి చర్చించారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుని నిర్మించిన భవనాలకు మళ్ళీ వాస్తు పేరుతో చాలా మార్పలే చేశారు చంద్రబాబు. గోడలు కొట్టించటం, కొత్తగా గోడలతో పార్టిషన్లు చేయించటం, గేట్లు ఎత్తేయించటం లాంటి అనేక మార్పులు జరిగాయి.
సరే వాస్తు పేరుతో ఎన్ని మార్పులు చేసినా చివరకు అధికారంలో నుండి దిగిపోవాల్సొచ్చింది. అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి వచ్చిన కొద్ది రోజులకే ప్రభుత్వం వాస్తు పేరుతో మార్పులు చేయటం మొదలుపెట్టింది. సిఎం ఛాంబర్ ను పార్టిషన్ చేశారు. ప్రధాన ద్వారాన్ని మూసేయించి మరో వైపు నిర్మించారు. ఇంత చేసిన తర్వాత కూడా ఎక్కడో లోపాలున్నట్లు అనిపించిందేమో. తాజాగా సచివాలయం గేట్ 1, అసెంబ్లీ గేటు 2 కు అడ్డంగా గోడ కట్టేశారు. అంటే పై గేట్లను శాశ్వతంగా మూసేసినట్లే అనుకోవాలి. నెల రోజుల క్రితం సచివాలయంలోని ఉత్తర, దక్షిణ దిశలో ఉన్న గేట్ల దగ్గర, విజిటర్లు వచ్చే కార్యాలయం దగ్గర కూడా అడ్డుగోడలను నిర్మించారు. హేమిటో వాస్తుమార్పులతో చేసే ఖర్చులకు బదులు కొత్త భవనాలే కట్టచ్చేమొ.