ప్రధాని దృష్టిలో పెద్ది ఉండటం గ్రేటే

ఢిల్లీలో జరిగిన పెద్ది ప్రెస్ మీట్ లో రామ్ చరణ్ ఒక ఆసక్తికరమైన విషయం పంచుకున్నాడు. గతంలో ఒకసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలుసుకున్నప్పుడు పెద్ది దేని గురించో చెప్పమని అడిగారని, అప్పుడు తాను బదులు చెబుతూ వికసిత్ భారత్ కాన్సెప్ట్ తరహాలో గ్రామాలు బాగుంటే అక్కడి వాళ్లకు అవకాశాలు వస్తే దేశం గొప్ప స్థాయికి వెళ్తుందనే తరహాలో సందేశం ఉంటుందని వివరించాక, బెంగాల్ నుంచి పైకొచ్చిన మొహమ్మద్ అనే ఫుట్ బాల్ ప్లేయర్ ప్రస్తావన ఇద్దరి మధ్య వచ్చిందట.

అంటే ఈ లెక్కన పెద్ది ఏకంగా ప్రధాని దృష్టిలో ఉన్నట్టు అర్థమవుతోంది. ఇది నార్త్ ప్రమోషన్లకు ఎంత మేరకు ఉపయోగపడుతుందో చూడాలి. పబ్లిసిటీ పరంగా చరణ్ టీమ్ ఎంత చేయాలో అంతా చేసింది. తనతో పాటు దివ్యెందు శర్మ, బోమన్ ఇరానీ, జాన్వీ కపూర్ ప్రతి చోటా వెళ్లి తమ వంతు సహకారం అందిస్తున్నారు. బెంగళూరులో శివ రాజ్ కుమార్ తోడ్పడ్డారు. భోపాల్ లో ఏఆర్ రెహమాన్ ఏకంగా లైవ్ కన్సర్ట్ నిర్వహించి హైప్ పెంచడంలో ఉపయోగపడ్డారు.

ఇక జూన్ 4 దగ్గరలో ఉంది. కాంపిటీషన్ లేకపోవడంతో ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా రికార్డులు బద్దలు కావడం ఖాయం అనిపించేలా ఉంది. ట్రైలర్ తర్వాత వచ్చిన మిశ్రమ స్పందన దృష్టిలో ఉంచుకుని మరో కొత్త వెర్షన్ సిద్ధం చేసే పనిలో దర్శకుడు బుచ్చిబాబు ఉన్నట్టు సమాచారం. హైదరాబాద్ లో జూన్ 2 జరగబోయే గ్రాండ్ ప్రెస్ మీట్ లో దీన్ని లాంచ్ చేసే అవకాశం ఉంది. అక్కడితో ప్రచార పర్వానికి ముగింపు పలుకుతారని సమాచారం.

ఇక్కడ మోడీ మీటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం మరొకటి ఉంది. పెద్దిలో రామ్ చరణ్ పెర్ఫార్మన్స్ గురించి అందరూ నేషనల్ అవార్డు వస్తుందనే రేంజ్ లో ఎలివేషన్లు ఇస్తున్నారు. ఒకవేళ ఆ స్థాయిలో నటన కనక ప్రదర్శించి ఉంటే సానుకూల పరిణామం జరగొచ్చేమో. పుష్పలో అల్లు అర్జున్ సాధించాక అతి తక్కువ గ్యాప్ లో అందుకున్న ఘనత చరణ్ కు దక్కుతుంది. కాకపోతే దురంధర్ రూపంలో రణ్వీర్ సింగ్ ఆల్రెడీ రేసులో ఉన్నాడని బాలీవుడ్ మీడియా గెస్ చేస్తోంది.