మేన‌ల్లుడి రిసెప్ష‌న్‌కు మేన‌మామ డుమ్మా!

ఏపీ కాంగ్రెస్ చీఫ్‌ వైఎస్ షర్మిల కుమారుడు రాజా రెడ్డి, అట్లూరి ప్రియ‌ల వివాహం రాజ‌స్థాన్‌లొ జ‌రిగిన విష‌యం తెలిసిందే. అయితే.. విహానంత‌రం హైద‌రాబాద్ శివారులోని శంషాబాద్‌లో శ‌నివారం రాత్రి ఘ‌న‌మైన రిసెప్ష‌న్ ఇచ్చారు. అయితే.. ఈ కార్య‌క్ర‌మానికి రాజారెడ్డి మేన‌మామ‌, ఏపీ సీఎం జ‌గ‌న్ డుమ్మా కొట్టారు. నిశ్చితార్థ వేడుక‌లో పాల్గొన్న ఆయ‌న రిసెప్ష‌న్‌కు వ‌చ్చే స‌రికి గైర్హాజ‌ర‌య్యారు. దీంతో ఈ వ్య‌వ‌హారం రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశం అయింది. రాజారెడ్డి వివాహం త‌ర్వాత‌.. ఏపీకి తిరిగి వ‌చ్చిన ష‌ర్మిల‌.. పార్టీ త‌ర‌ఫున నిర‌స‌న కార్య‌క్ర‌మాలుచేప‌ట్టారు. ఆమెను పోలీసులు అరెస్టు కూడా చేశారు.

ఈ నేప‌థ్యంలో నియంత ప్ర‌భుత్వం, నియంత పాల‌కుడు అని ష‌ర్మిల తెగ విమ‌ర్శ‌లు గుప్పించారు. దీంతో నొచ్చుకున్న సీఎం జ‌గ‌న్ ఈ రిసెప్ష‌న్‌కు దూరంగా ఉన్నార‌ని వైసీపీ నాయ‌కులు భావిస్తున్నారు. మ‌రోవైపు.. వైసీపీకి చెందిన నాయ‌కులు కూడా ఎవ‌రూ హాజ‌రు కాక‌పోవ‌డంతో అధిష్టానం నిలువ‌రించింద‌నే వాద‌న కూడా వినిపిస్తోంది. ఇక‌, రాజారెడ్డి, అట్లూరి ప్రియ‌ల రిసెప్ష‌న్‌ వేడుకకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, వైఎస్ ఆత్మ‌ కేవీపీ సహా పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు.

రాజ‌స్థాన్‌లోని జోధ్‌పూర్ లో జరిగిన వివాహానికి షర్మిల సోదరుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ గైర్హాజరు కావడం తెలిసిందే. శనివారం రాత్రి శంషాబాద్‌లో జరిగిన షర్మిల కుమారుడి మ్యారేజ్ రిసెప్షన్‌కు సైతం వైఎస్ జగన్ హాజరు కాకపోవడం హాట్ టాపిక్ అవుతోంది. అంతకుముందు గత నెలలో హైదరాబాద్ లో జరిగిన రాజా రెడ్డి, ప్రియల నిశ్చితార్థ వేడుకకు ఏపీ సీఎం జగన్ హాజరయారు. రాజ‌కీయాల‌ను రాజ‌కీయంగానే చూడాల‌ని ప‌లువురు సూచిస్తున్నారు. కానీ, రాజ‌కీయాలు వైఎస్ కుటుంబాన్ని ఎంత విడ‌దీయాలో అంతా విడ‌దీసేశాయ‌ని.. ఇక క‌లుసుకోవ‌డం క‌ల్లేన‌ని అనేవారు కూడా ఉన్నారు. మ‌రోవైపు.. రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ఈ వేడుక‌లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు.