వైసీపీ నేతలపై టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ .షర్మిలపై సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులపై నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “జగన్ పేటీఎం కూలీలకు ఐదు రూపాయలిచ్చి… ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల పెళ్లిపై, పుట్టుకపై నీతి లేకుండా విమర్శలు చేయిస్తున్నాడు. షర్మిల పెళ్లి-పుట్టుక ఈ పేటీఎం బ్యాచ్‌కు ఇప్పుడే గుర్తుకు వచ్చిందా?” అని ధ్వజమెత్తారు. ఇదంతా వైఎస్ పేరు చెప్పుకొనే జగన్‌కు అవమానంగా కాదా? అని నిలదీశారు.
బొత్స కుటుంబంపై..
విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన శంఖారావం సభలో నారా లోకేష్ మాట్లాడుతూ.. మంత్రి బొత్స సత్యానారాయణ కుటుంబంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మంత్రి బొత్స పెన్నులో ఇంకు.. అవినీతి ఫైళ్లపై సంతకాలు చేసేందుకే సరిపోతోందని దుయ్యబట్టారు. మంత్రి బొత్స కుటుంబమంతా విజయనగరం జిల్లాకు క్యాన్సర్ గడ్డలా తయారైందని మండిపడ్డారు. బొత్స అనే క్యాన్సర్ గడ్డకు ఓట అనే రేడియేషన్ అవసరమని అన్నారు. నాయకులు పార్టీ మారినా కార్యకర్తలు టీడీపీలోనే కొనసాగుతారని.. వారికి టీడీపీతో పేగు బంధమని వ్యాఖ్యానించారు.
జగన్ 420
“జగన్ ఓ 420… ఆయన సలహాదారులు 840.. అధికారం ఉందని ఏక పక్షంగా వ్యవహారించిన వైసీపీ నేతలు, అధికారుల పేర్లను రెడ్ బుక్ లోకి రాసుకున్నా. జగనే అసమర్థుడంటే ఆయన మంత్రివర్గమంతా చెత్తగాళ్లే” అని నారా లోకేష్ నిప్పులు చెరిగారు. టీడీపీ – జనసేన ప్రభుత్వం ఏర్పడగానే వైసీపీ మంత్రుల అవినీతిపై అక్రమాలపై చర్యలు ప్రారంభిస్తామని.. ప్రతి ఫైలును క్షుణ్ణంగా సమీక్షించి.. కటకటాల్లోకి నెడతామని వ్యాఖ్యానించారు. కాగా, రోజుకు మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న నారా లోకేష్ గురువారం రెండు నియోజకవర్గాలకే పరిమితమయ్యారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates