కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ నాయకురాలు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నేత రేణుకా చౌదరికి ఊ హించని గిఫ్ట్ తగిలింది. పార్టీ నుంచి ఆమెకు రాజ్యసభ సీటు ఆఫర్ వచ్చింది. ప్రస్తుతం రాజ్యసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రేణుకకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఖరారు చేయడం.. రేణుక శిబిరంలో ఆనందం పం చుతోంది. ఇదేసమయంలో వ్యతిరేక వర్గంలోనూ సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాజ్యసభ స్థానాల్లో 3 స్థానాలు ఖాళీ అవుతున్నాయి.
ప్రస్తుతం రాష్ట్రం మొత్తానికీ ఏడు రాజ్యసభ స్థానాలు ఉంటే.. ఏడు కూడా.. బీఆర్ ఎస్ పార్టీలోనే ఉన్నాయి. ఇప్పుడు తొలిసారి.. కాంగ్రెస్ అధికారంలోకి రావడం.. ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా.. ఖాళీ అవుతున్న మూడు స్థానాలు కూడా.. ఈ పార్టీకే దక్కనున్నాయి. బీఆర్ ఎస్ కు చెందిన నాయకులు వద్దిరాజు రవిచంద్ర, బి. లింగయ్య యాదవ్, జోగినపల్లి సంతోష్‌ల స్థానాలు ఈ ఏడాది ఏప్రిల్‌లో ఖాళీ అవుతున్నాయి. ఇవి మూడు కాంగ్రెస్ కోటాలోకి వస్తున్న విషయం తెలిసిందే.
దీంతో ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌కు అత్యంత విధేయురాలిగా పేరు తెచ్చుకున్న రేణుకకు ఓ సీటు ఇస్తూ.. ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. దీంతో రేణుక శిబిరంలో ఆనందం నిండిపోయింది. ప్రస్తుతం ఆమె ఢిల్లీలో ఉన్నట్టు సమాచారం. అక్కడే ఉండి చక్రం తిప్పారని పార్టీలో తెలుస్తోంది.
ఇదిలావుంటే.. ఖమ్మం కాంగ్రెస్‌లో రేణుక వ్యతిరేక వర్గంగా ఉన్న భట్టి విక్రమార్క అనుచరులు కూడా రేణుకకు ఎంపీ సీటు ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక కారణాలు వేరేగా ఉన్నాయి. మొత్తానికి ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీకి క్లియరెన్స్ లభించినట్టేనని అంటున్నారు పరిశీలకులు. వాస్తవానికి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో రేణుక.. ఖమ్మం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే.