జంగా కూడా జంపేనా..!

బీసీ నాయ‌కుడు, సీఎం జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడిగా పేరు తెచ్చుకున్న జంగా కృష్ణ‌మూర్తి కూడా.. జంపైపోతున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు. సుదీర్ఘ కాలం రాజ‌కీయాల్లో ఉన్న జంగా.. గ‌తంలో గుర‌జాల నుంచి కాంగ్రెస్ టికెట్‌పై రెండుసార్లు(1999, 2004) విజ‌యం ద‌క్కించు కున్నారు. త‌ర్వాత‌.. అనూహ్య ప‌రిణామాలతో ఆయ‌న ఎదురీదుతున్నారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. వైసీపీకి జై కొట్టిన జంగా.. గ‌త ఎన్నిక‌ల్లోనే గుర‌జాల టికెట్‌ను ఆశించారు.

అయితే, కాసు మ‌హేష్‌రెడ్డి ఎంట్రీతో జంగా త్యాగం చేయాల్సి వ‌చ్చింది. కానీ, ఇప్పుడు మాత్రం త‌నకే టికెట్ కేటాయించాల‌ని ఆయ‌న ప‌ట్టుబ‌డుతున్నారు. పైగా.. ఎమ్మెల్యే కాసుకు, జంగాకు మ‌ధ్య పొస‌గ‌డం లేదు. ఎప్ప‌టి నుంచో వీరి మ‌ధ్య ఆధిప‌త్య రాజ‌కీయాలు కొన‌సాగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో త‌న సామాజిక వ‌ర్గంతోపాటు.. బీసీ సంఘాల‌ను కూడా జంగా ఏకం చేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌నే పోటీ చేయ‌నున్నాన‌ని ఆయ‌న ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. సీఎం జ‌గ‌న్‌పై త‌న‌కు న‌మ్మ‌కం ఉంద‌ని అన్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ త‌న‌కే టికెట్ ఇస్తార‌ని, తనే పోటీ చేస్తాన‌ని కొన్నాళ్లుగా జంగా చెబుతున్నారు. ఇక‌, స‌భ‌లు కూడా పెడుతున్నారు. ఈయ‌న ప్ర‌భావం నిజంగానే గుర‌జాల‌పై ఉంద‌న‌డంలో సందేహం లేదు. ఇటీవ‌ల‌.. వైసీపీ సాధికార బ‌స్సు యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా జ‌రిగినా.. గుర‌జాల‌లో మాత్రం జ‌ర‌గ‌లేదు. దీనికి కార‌ణం.. జంగా స‌హ‌క‌రించ‌క‌పోవ‌డ‌మేన‌న్న‌ది తెలిసిందే. ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ సీటు విష‌యాన్ని వైసీపీ ఇంకా తేల్చ లేదు. మ‌రోవైపు కాసు మ‌హేష్‌రెడ్డి త‌న వంతు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు.

ఫ‌లితంగా.. గుర‌జాల నియోజ‌క‌వ‌ర్గం టికెట్ వ్య‌వ‌హారం.. ఆస‌క్తిగా మారింది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో జంగా కూడా పార్టీ మారేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని అంటున్నారు. తాజాగా ఆయ‌న వైసీపీపై అసంతృప్తి తో ఉన్న కొలుసు పార్థ‌సార‌థిని క‌లుసుకోవ‌డం.. ఆస‌క్తిగా మారింది. అయితే.. ఇప్పుడున్న ప‌రిస్థితిలో జంగా టీడీపీ గూటికి చేరినా.. గుర‌జాల టికెట్ ద‌క్కే ఛాన్స్ లేదు. ఎప్ప‌టి నుంచో ఉన్న య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావుకే.. ఈ సీటు ద‌క్క‌నుంది. సో.. దీనిని బ‌ట్టి.. ఆయ‌న కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. కాంగ్రెస్‌తో ఉన్న అనుబంధం.. పైగా ష‌ర్మిల పార్టీ ప‌గ్గాలు చేప‌ట్ట‌నుండ‌డంతో ఆయ‌న చూపు కాంగ్రెస్‌వైపు ఉండే అవకాశం ఉంద‌ని స‌మాచారం. ఏం జ‌రుగుతుందో చూడాలి.