ఒకే సారి మూడు ఎన్నిక‌లు.. ఏపీలో మ‌రింత సెగ‌..!

ఏపీలో మ‌రో రెండు మాసాల్లో కీల‌క‌మైన అసెంబ్లీ ఎన్నిక‌ల‌తోపాటు.. పార్ల‌మెంటు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అయితే.. ఈ రెండే కాదు.. ఇప్పుడు మ‌రో ఎన్నిక కూడా తెర‌మీదికి వ‌చ్చింది. అదే రాజ్య‌స‌భ ఎన్నిక‌లు. మొత్తం 3 స్థానాల‌కు ఈ సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌రానికి ముందే.. ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. వాస్త‌వానికి ఇప్ప‌టి వ‌ర‌కు అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల విష‌యం మాత్రమే రాజ‌కీయంగా ప్రాధాన్యం ఉంది.

కానీ, ఇదేస‌మ‌యంలో చాప‌కింద నీరులా.. మూడు రాజ్య‌స‌భ స్థానాల‌కు కూడా ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ కొన‌సాగుతోంది. ప్ర‌స్తుతం విజ‌య‌వాడ‌లోనే ఉన్న కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన అధికారులు.. ఈ విష‌యంపైనా దృష్టి పెట్టారు. వైసీపీకి చెందిన ఒక‌రు, టీడీపీకి చెందిన మ‌రొక‌రు.. టీడీపీ త‌ర‌పున టికెట్ సొంతం చేసుకుని త‌ర్వాత బీజేపీ బాట‌ప‌ట్టిన మ‌రొక‌రు కూడా ఏప్రిల్ మాసాంతానికి రిటైర్ కానున్నారు, వారే.. వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి(వైసీపీ), క‌న‌క‌మేడ‌ల రవీంద్ర‌కుమార్‌(టీడీపీ), సీఎం ర‌మేష్‌(టీడీపీ నుంచి బీజేపీ)లు ఉన్నారు.

ఈ మూడు ఎన్నిక‌లు కూడా.. నామినేటెడ్ కాదు. నేరుగా అసెంబ్లీకి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న‌ ఎమ్మెల్యేలు ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పాల్గొన‌డం ద్వారా ఎన్నుకుంటారు. దీంతో ఈ ఎన్నిక‌ల‌కు సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు మించి ప్రాధాన్యం ఏర్ప‌డింది. వాస్త‌వానికి 151 మంది ఎమ్మెల్యేల‌తో బ‌లంగా ఉన్న వైసీపీ ఈ మూడు ద‌క్కిం చుకునే అవ‌కాశం ఉంది. కానీ, రాష్ట్రంలో మారిన స‌మీక‌ర‌ణ‌లు.. రాజ‌కీయ వైరాల నేప‌థ్యంలో టీడీపీ కూడా బ‌లంగానే పోరాడేందుకు రెడీ అయింది.

క‌నీసం ఒక్క‌స్థానాన్న‌యినా.. తాము ద‌క్కించుకుంటామ‌ని తాజాగా టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు ఎన‌మ‌ల రామ‌కృష్ణుడు వ్యాఖ్యానించారు. అంటే. గ‌త ఏడాది జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో వైసీపీ ఎమ్మెల్యే లు చేసిన క్రాస్ ఓటింగ్ కార‌ణంగా.. టీడీపీ విజ‌యం ద‌క్కించుకున్న‌ట్టుగానే .. ఇప్పుడు రాజ్య‌స‌భ సీట్ల విష‌యంలోనూ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న చెప్ప‌క‌నే చెప్పారు. ప్ర‌స్తుతంటికెట్ ద‌క్క‌ని వారు.. చాలా మంది వైసీపీలో ర‌గిలిపోతున్నారు.

ఈ క్ర‌మంలో వారంతా .. రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో టీడీపీకి లోపాయికారీ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించినా ఆశ్చ‌ర్యం లేద‌ని అంటున్నారు. ఇక‌, ఈ విష‌యాన్ని ప‌సిగ‌ట్టిన వైసీపీ త‌న వారిని రెబ‌ల్స్‌గా మార‌కుండా చాలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగానికి అసెంబ్లీ-పార్ల‌మెంటుతో పాటు రాజ్య‌స‌భ ఎన్నిక‌లు రాష్ట్రంలో సెగ‌లు పుట్టిస్తుండ‌డం గ‌మ‌నార్హం.