ఏపీ రాజకీయాల్లో తరచుగా వినిపించే పేరు విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పేరే. ఆయన ఎక్కడున్నారు.. ఏం చేస్తున్నారు.. అనేది పక్కన పెడితే.. విజయవాడ, రాజమండ్రి, హైదరాబాద్.. ఇలా ఆయన ఎక్కడ మీడియాకు తారసపడినా.. వెంటనే ఆయన చుట్టూ రాజకీయాలు ముసురుకుంటాయి. మీరు ఏ పార్టీలో చేరుతున్నారు? ఎక్కడ నుంచి పోటీ చేస్తున్నారు? అంటూ.. మీడియా ఆయనను ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేయడం.. తెలిసిందే. తాజాగా ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. లగడపాటి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రత్యక్షమయ్యారు.
దీంతో మీడియా ఆయనను చుట్టేసింది. ఎన్నికలు సమీపిస్తుండడం.. ఏపీలో కాంగ్రెస్ పుంజుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తుండడం.. మరోవైపు.. ఇటు టీడీపీ, అటు వైసీపీలు లగడపాటి వంటి బలమైన నాయకుల కోసం ఎదురు చూస్తుండడంతో ఇవే ప్రశ్నలకు మీడియా ఆయనకు సంధించింది. అయితే.. ఆయన మాత్రం యధాలాపంగా తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లోనే కాదు.. భవిష్యత్ ఎన్నికల్లోనూ తాను పోటీ చేయాలని భావించడం లేదన్నారు. కాంగ్రెస్ తోనే అయిపోయింది. ఆ రోజు మా మాట విని ఉంటే.. పార్టీ పరిస్థితి, మా పరిస్థితి వేరేగా ఉండేది అని లగడపాటి అన్నారు.
వారిద్దరికీ సాయం
ఇక, తాను రాజకీయాల్లో దూరంగా ఉన్నప్పటికీ.. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మాజీ ఎంపీ హరీష్‌కుమార్‌కు, రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌లకు తాను ఎప్పుడూ చేరువగానే ఉంటానని లగడపాటి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వారు ఎక్కడ నుంచి పోటీ చేసినా.. తాను వచ్చి ప్రచారం చేస్తానని చెప్పారు. ఇంతకుమించి తాను ఏమీ చెప్పేది లేదన్నారు. అయితే..ఏపీలో కాంగ్రెస్ పుంజుకుంటే మంచిదేనని అన్నారు. తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావడం ఆనందంగానే ఉందన్నారు.
జోస్యం విఫలం కావడంతో..
2019 ఎన్నికలకు లగడపాటి ఓ ప్రముఖ టీవీ చానెల్‌తో కలిసి ఏపీలో సర్వే చేశారు. దీనికి సంబంధించి ఆయన ఫలితాలు వెల్లడించారు. ఏపీలో ప్రజలు మరోసారి చంద్రబాబునే కోరుకుంటున్నారని.. వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోతుందని చెప్పారు. ఇక, పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెడతారని అన్నారు. ఈ జోస్యం తప్పయితే.. ఇక నుంచి తాను సర్వేలు చేయనని అప్పట్లో ఆయన ప్రకటించారు అయితే.. అనూహ్యంగా లగడపాటి చెప్పిన ఈక్వేషన్ రాంగయింది. దీంతో ఆయన అటు రాజకీయాలు. ఇటు సర్వేలకు కూడా గుడ్‌బై చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates