మెదక్ ఎంపీగా కేసీయార్ ?

తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో కేసీయార్ పోటీ చేయాలని డిసైడ్ అయ్యారట. మెదక్ పార్లమెంటు నుండి పోటీచేస్తే గెలుపు ఖాయమని అనుకుంటున్నట్లు పార్టీవర్గాల సమాచారం. ఉమ్మడి మెదక్ జిల్లాలో పార్టీ బలంగా ఉంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మెదర్ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు చోట్ల బీఆర్ఎస్సే గెలిచింది. అందుకనే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేయాలని కేసీయార్ అనుకుంటున్నట్లు తెలిసింది. బీఆర్ఎస్ ఎల్పీగా కేసీయార్ ఎన్నికైన విషయం తెలిసిందే.

అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా కేసీయార్ అసెంబ్లీలోకి అడుగుపెట్టే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉండగా రేవంత్ విషయంలో కేసీయార్ ఏ విధంగా వ్యవహరించారో అందరికీ తెలిసిందే. అసెంబ్లీలో రేవంత్ ను కేసీయార్ అసలు నోరెత్తనీయలేదు. ఎప్పుడు మాట్లాడేందుకు ప్రయత్నించినా మైక్ కట్ చేయటం లేదా సభ నుండి బయటకు పంపేయటమే మార్గంగా కేసీయార్ ఎంచుకున్నారు. చివరకు నెలరోజుల పాటు రేవంత్ ను సభ నుండి సస్పెండ్ కూడా చేయించారు.

వాటన్నింటినీ రేవంత్ ఎప్పటికీ మరచిపోరు. ఎందుకంటే ఇపుడు జరగుతన్నదంతా రివేంజ్ పాలిటిక్సనే చెప్పాలి. బదులుకు బదులు తీర్చేయటమే పాలిటిక్స్ లో కొత్త ట్రెండుగా నడుస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇపుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల తీరే ఇందుకు నిదర్శనంగా కనబడుతోంది. సభలో బూతులు తిట్టుకోవటం లేదు కానీ మిగిలినవన్నీ చేస్తున్నారు. దీనికి కారణం ఏమిటంటే బీఆర్ఎస్ ఇంకా అధికారంలోనే ఉందన్నట్లుగా కేటీయార్, హరీష్ రావులు మాట్లాడుతున్న విధానమే.

ఎన్నికల ప్రచారంలో మాట్లాడినట్లుగానే ఎప్పటిదో ఇందిరాగాంధీ పరిపాలనను విమర్శించటం, కర్నాటక ప్రభుత్వ విధానాలపై ఆరోపణలు చేయటం ఎందుకో కేటీయార్, హరీష్ కే తెలియాలి. తెలంగాణాలో ప్రస్తుతానికి ఏమాత్రం ఉపయోగంలేని ఇందిరాగాంధి పాలనను ప్రస్తావిస్తున్న కారణంగానే రేవంత్, మంత్రులు కేటీయార్, హరీష్ ను వాయించేస్తున్నారు. తెలంగాణాలో ప్రస్తుత దరిద్రానికి కేసీయార్ పరిపాలనే కారణమని రేవంత్ అండ్ కో ఎదురుదాడులు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేసీయార్ సభకు వచ్చి రేవంత్ ను ఫేస్ చేయటం కష్టమే. అందుకనే రాబోయే ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీచేసి కేంద్రానికి వెళ్ళిపోవాలని అనుకున్నారట.