బర్రెలక్క : చేతిలో 5 వేలు.. బ్యాంకులో 1500.. ఇదీ లెక్క‌!!

ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థుల గురించి.. ఎవ‌రైనా  చాలానే ఊహించుకుంటారు. ఎంతో స్థితిమంతులుగా భావిస్తారు. ఇది స‌హ‌జ‌మే. ఎందుకంటే ప్ర‌స్తుతం రాజ‌కీయాలు, ఎన్నిక‌లు కూడా.. అంతే ఖ‌రీదు అయిపో యాయి. కోటీశ్వ‌రులు త‌ప్ప‌.. ఎన్నిక‌ల్లో పోటీచేసే ప‌రిస్థితి లేకుండా పోయింది. ఏపీ, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో అయితే.. మ‌చ్చుకైనా ల‌క్షాధికారి క‌నిపించ‌డం లేదు. ఎన్నిక‌ల్లో పోటీ చేసే వ్య‌క్తులు.. మ‌గైనా ఆడైనా.. కోటీశ్వ‌రులే. ఇది ఎవ‌రో చెప్పిన లెక్క‌కాదు.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం వెల్ల‌డించిన వివ‌రాలు.

అయితే.. ఇంత పెద్ద కోటీశ్వ‌రుల యుద్ధంలో చేతిలో చిల్లిగ‌వ్వ‌కూడా లేకుండా.. పోటీ చేస్తున్న యువ‌తి గురించి.. తాజాగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం అఫిడ‌విట్‌ను బ‌య‌ట పెట్టింది. ఆమే.. కొల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్న క‌ర్నే శిరీష. ఉర‌ఫ్ బ‌ర్రెల‌క్క‌. వాస్త‌వానికి.. తెలంగాణ‌లో అనేక మంది స్వ‌తంత్ర అభ్య‌ర్థులు బ‌రిలో ఉన్నారు. అయితే.. వారి ఆస్తులు కూడా కోట్ల‌లోనే ఉన్నాయి. కానీ, ఒక్క బ‌ర్రెల‌క్క ఆస్తులు మాత్రం(క‌మ్యూనిస్టులు మిన‌హా) కేవ‌లం 5 వేల రూపాయ‌ల‌తో బ‌రిలో నిలిచార‌ని ఈసీ పేర్కొంది.

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న బ‌ర్రెల‌క్క ఈసీకి స‌మ‌ర్పించిన అఫిడ‌విట్ వివ‌రాల మేర‌కు.. ఆమె ఆస్తులు.. అప్పుల వివ‌రాల‌ను ఈసీ వెబ్‌సైట్‌లో పేర్కొంది. దాని వివ‌రాలు.. ఇవీ..

+  చేతిలో ఉన్న సొమ్ము రూ.5000
+  బ్యాంకు బాల‌న్స్ రూ.1500
+ ఉద్యోగం:  నిరుద్యోగం
+ వృత్తి:  బ‌ర్రెల పెంప‌కం
+ త‌ల్లిదండ్రుల ఆస్తి:  రేకుల షెడ్‌
+ కుటుంబం: ఇద్ద‌రు త‌మ్ముళ్లు
+ వివాహం:  కాలేదు.
+ చ‌దువు:  బీకాం
+  వాహ‌నాలు:  ఏమీ లేవు.
+ అప్పులు :  లేవు
కొస‌మెరుపు:  తెలంగాణ‌లో పోటీచేస్తున్న అనేక మంది నాయ‌కులు త‌మ‌కు ఉన్న ఆస్తిని దాచుకునే ప్ర‌య‌త్నం చేయ‌గా.. దాచుకోవ‌డానికి ఏమీ లేని అభ్య‌ర్థిగా నెటిజ‌న్ల మ‌న్న‌న‌లు అందుకుంటున్నారు శిరీష‌.