పవన్ అక్కడి నుంచే.. జెండా ఊపిన బాబు

వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ పోటీ చేసే స్థానం ఖాయమైందా? మరోసారి ఆయన భీమవరం నుంచి బరిలో దిగబోతున్నారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. తాజాగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో చర్చల సందర్భంగా పవన్ పోటీ చేసే స్థానం ఖరారైందని తెలిసింది. మరోసారి భీమవరం నుంచే లక్ పరీక్షించుకోవాలని పవన్ భావించగా.. అందుకు బాబు సరేనన్నారని సమాచారం.

2019 ఏపీ ఎన్నికల్లో విశాఖ జిల్లా గాజువాక, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి పవన్ పోటీ చేశారు. కానీ రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. ఈ సారి ఎన్నికల్లో మాత్రం పవన్ ఒకచోటు నుంచే పోటీ చేయాలని అనుకుంటున్నట్లు తెలిసింది. గత ఎన్నికల్లో ఓటమి ఎదురైనా భారీ స్థాయిలోనే ఓట్లు రావడంతో భీమవరంపైనే పవన్ మనసు ఉందని సమాచారం. గత ఎన్నికల్లో వైసీపీ నేత గ్రంధి శ్రీనివాస్ కు 70,642 ఓట్లు, పవన్ కల్యాణ్ కు 62,285 ఓట్లు, టీడీపీ అభ్యర్థి అంజిబాబుకు 54,037 ఓట్లు వచ్చాయి. పవన్ రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత భీమవరంలో తన సామాజిక వర్గం అండతో పట్టు పెంచుకోవడంపై ఫోకస్ పెట్టారు.

ఇక వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గంలో నిలిస్తే గెలుపు దక్కుతుందని పవన్ వ్యక్తిగతంగా సర్వేలు చేయించుకున్నట్లు టాక్. తిరుపతి, అనంతపురం, పిఠాపురం, భీమవరం, గాజువాక తదితర నియోజకవర్గాల్లో పరిస్థితిపై సర్వేల ద్వారా పవన్ ఓ అంచనాకు వచ్చినట్లు తెలిసింది. ఈ సర్వేల ప్రకారం భీమవరంలో గెలిచే అవకాశాలున్నట్లు పవన్ కు తెలిసిందని సమాచారం. దీంతో పొత్తులో ఉన్న టీడీపీతో సీట్ల విషయంపై ముందే ఓ స్పష్టతకు వచ్చేందుకు పవన్ సిద్ధమయ్యారు. తాజాగా తన సీటు విషయంపై ఓ క్లారిటీకి వచ్చారు. అయితే జనసేన పోటీ చేసి మిగతా స్థానాలపై మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.