రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధులను దళితబంధు పథకమే ముంచేస్తుందేమో అనే ప్రచారం పెరిగిపోతోంది. ఎందుకంటే ప్రతి బహిరంగసభలోను కేసీయార్ ఈ పథకం గురించి పదేపదే ప్రస్తావిస్తున్నారు. దళితబంధు పథకం సృష్టికర్తను తానే అని ఈ పథకాన్ని బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉందా అని చాలెంజ్ చేస్తున్నారు. నిజానికి కేసీయార్ చాలెంజులో అర్ధమేలేదు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి పెట్టిన పథకం మరో ముఖ్యమంత్రి ఎలా ప్రవేశపెట్టగలరు ? ఒక్కొక్కళ్ళకి ఒక్కో ఆలోచనుంటుంది. దాని ప్రకారమే స్కీములు పెట్టుకుంటారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే దళితబంధు పథకాన్ని కేసీయార్ 2021లో జరిగిన హుజూరాబాద్ ఉపఎన్నిక సందర్భంగా ప్రకటించారు. పథకాన్ని ప్రకటించారు కానీ దాని అమలును మాత్రం గాలికొదిలేశారు. పథకం పెట్టినపుడు 2 లక్షలమంది లబ్దిదారులకు వర్తింపచేస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. అయితే ఇప్పటివరకు పథకం అందుకున్నది కేవలం 38 వేలమంది మాత్రమే. నియోజకవర్గానికి 1500 మంది తక్కువ కాకుండా అని ప్రకటించారు. తర్వాత దాన్ని 100కి కుదించారు. కారణం ఏమిటంటే నిధుల సమస్య.
ఏ సభలో కేసీయార్ ఆ పథకంగురించి ఎన్నిమాటలు మాట్లాడినా పథకమైతే సక్రమంగా అమలుకావటంలేదన్నది వాస్తవం. పైగా లబ్దిదారుల ఎంపికలో ఎంఎల్ఏలు బాగా కమీషన్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు కూడా పెరిగిపోయాయి. దాంతో అనేక కారణాల వల్ల పథకం కుంటుకుంటు నడుస్తోంది. ఇపుడు ఎన్నికల్లో లబ్దికోసం కేసీయార్ పదేపదే దళితబంధు పథకం గురించే చెబుతున్నారు. అయితే దాని అమలుగురించి మాత్రం ఎక్కడా మాట్లాడటంలేదు. కేసీయార్ పథకం గురించి ప్రస్తావించినప్పుడల్లా జనాలు పథకం అమలుగురించి మాట్లాడుకుంటున్నారు.
గడచిన రెండు బడ్జెట్లలో పథకం కోసం రు. 35,400 కోట్ల కాగితాల మీద కేటాయించారు. అయితే మూడేళ్ళల్లో విడుదల చేసింది మాత్రం రు. 3,842 కోట్లు మాత్రమే. ఈ లెక్కన పథకం అమలు సంపూర్ణంగా ఎప్పుడు అవుతుందో ఎవరు చెప్పలేకపోతున్నారు. కాబట్టి దళితబంధు పథకం అమలుపై లబ్దిదారుల్లో బాగా అసంతృప్తి పెరిగిపోతోంది. ఈ విషయం డైరెక్టుగా కేసీయార్ కు చెప్పేదెవరు ? అన్నదే అసలు పాయింట్.
Gulte Telugu Telugu Political and Movie News Updates