టికెట్ కోసం ఓ ఎంపీ జగన్ కు 12 కోట్లు ఇచ్చారు: రఘురామ

సీఎం జగన్ పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన ఆరోపణలు చేశారు. తన టికెట్ కోసం జగన్ రెడ్డికి ఓ ఎంపీ 12 కోట్లు ఇచ్చారని రఘురామ షాకింగ్ ఆరోపణలు చేశారు. అతితెలివితో పొన్నవోలు సుధాకర్ రెడ్డి వైసీపీకి కష్టాలు తెచ్చి పెట్టారని, ఎలక్ట్రోరల్ బాండ్స్ ద్వారా వైసీపీకి 600 కోట్లు వస్తే టిడిపికి 27 కోట్లు వచ్చాయని గుర్తు చేశారు. ఇక, మరో 10 వేల కోట్ల అప్పు కోసం నిర్మలా సీతారామన్ తో జగన్ రెడ్డి భేటీ అయ్యారని ఆరోపించారు.

ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు కూడా ఏపీలో డబ్బులు లేవని అన్నారు. అయితే, అక్రమ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన పోలీసులకు మాత్రం జీతాలు సకాలంలో పడ్డాయని ఆరోపించారు. విద్యార్థులకు ప్రశ్నా పత్రాలు ప్రింట్ చేసేందుకు కూడా ఏపీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని ఆరోపించారు. ఇతర పార్టీలలో సీఎం అభ్యర్థిని వైసీపీ నేతలు డిసైడ్ చేస్తారా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో ఉంటుందో లేదో వైసీపీకి అనవసరమని చెప్పారు. ఇక, లోకేష్ పిలుపునిచ్చిన కాంతితో క్రాంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

కృష్ణా జలాల పున: పంపిణీ వ్యవహారంపై కేంద్రానికి జగన్ లేఖ రాసి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. కృష్ణా జలాలు పంపిణీ అంశం పరిశీలన చేయాలన్న నిర్ణయం పై జగన్ అభ్యంతరం తెలిపారని అన్నారు. కానీ, జగన్ కు మోడీ అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఆరోపించారు. కృష్ణా జలాలలో తెలంగాణ వాటాతో ఏపీకి నష్టం ఎక్కువ అని అన్నారు. కృష్ణా జలాలపై సుప్రీంకోర్టుకు వెళ్లినా ఫలితం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. కృష్ణా జలాలు వృథా కాకుండా టిడిపి అధినేత చంద్రబాబు గతంలో చర్యలు చేపట్టారని గుర్తు చేశారు. ఈ సమస్య పరిష్కారం అయ్యేవరకు కేంద్రంపై జగన్ పోరాటం చేయాలని రఘురామ సూచించారు.