కొవాక్జిన్ వ్యాక్సిన్ చేసే విధానంలో మార్పునకు కేంద్రం ఓకే

కరోనాకు చెక్ పెట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రయోగాలు జరుగుతున్నాయి. పలు సంస్థలు ఇప్పటికే క్లినిక్ ట్రయల్స్ ను చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు రెండు దశలు పూర్తి అయి.. మూడో దశను చేపట్టారు.

భారత్ విషయానికి వస్తే.. ప్రఖ్యాత భారత్ బయోటెక్ సంస్థ తన కొవాక్జిన్ వ్యాక్సిన్ కు సంబంధించి క్లినికల్ ట్రయల్స్ ను నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ టీకాకు సంబంధించి కేంద్రం కీలక అనుమతుల్ని జారీ చేసింది. ఇప్పటివరకు కండరాలకు టీకా ఇచ్చే దానికి బదులుగా.. చర్మం కింది పొరల్లో టీకా ఇచ్చే ట్రయల్స్ కు అనుమతిని జారీ చేసినట్లుగా తెలుస్తోంది.

చికిత్సలో భాగంగా వ్యాక్సిన్ ను పలు విధాలుగా ఇస్తుంటారు. టీకాల్లో అత్యధికం కండరాలకు ఇస్తుంటారు. భుజాలకు.. పిరుదులకు టీకాలు ఇచ్చే పద్దతిని ఇంట్రామస్కులర్ రూట్ అంటారు. అందుకు భిన్నంగా మరికొన్ని టీకాల్ని నోటి ద్వారా.. నరాల ద్వారా ఇస్తారు. అలానే మరికొన్నింటిని చర్మం కింది పొరకు ఇస్తుంటారు. దీన్ని ఇంట్రాడెర్మల్ రూట్ అంటారు.

కండరాలకు కాకుండా.. చర్మం కింది భాగానికి టీకా ఇవ్వటం ద్వారా ఒక ప్రయోజనం ఉంది. కండరాలకు ఇచ్చే టీకాల్ని అతిక మోతాదులో ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా చర్మం కింది పొరలకైతే తక్కువ మోతాదు ఇస్తే సరిపోతుంది. ఎక్కువ మందికి టీకాలు ఇచ్చేందుకు ఈ విధానంలో కుదురుతుంది.

భారత్ లాంటి దేశంలో వ్యాక్సిన్ ను పెద్ద ఎత్తున ఇవ్వాల్సి వస్తే.. తాజాగా అనుమతి పొందిన పద్దతి (చర్మం కింది భాగానికి టీకా ఇవ్వటం)తో తక్కువ ధరకు.. ఎక్కువమందికి అందుబాటులోకి వచ్చే వీలుందని చెబుతున్నారు. ప్రస్తుతం భారత్ బయోటెక్ సంస్థ దేశ వ్యాప్తంగా పన్నెండు ఆసుపత్రుల్లో 1125 మంది రోగులపై మొదటి.. రెండో దశ క్లీనికల్ టెస్టుల్ని నిర్వహిస్తున్నారు. త్వరలోనే మూడో దశ ప్రయోగాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో టీకా చేసే పద్దతికి సంబంధించి కేంద్రం కీలక అనుమతిని ఇవ్వటం గమనార్హం.