చంద్రబాబుకు సీఐడీ మరో షాక్?

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో కేసులో 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏసీబీ కోర్టులో ఈరోజు ఆయన హౌస్ అరెస్ట్ పిటిషన్ పై విచారణ జరగనుంది. ఇప్పటికే చంద్రబాబు అరెస్టు, రిమాండ్ వ్యవహారాలతో షాక్ లో ఉన్న టిడిపి శ్రేణులకు తాజాగా ఏపీ సిఐడి అధికారులు మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. విజయవాడలో ఏసీబీ కోర్టులో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అవకతవకల వ్యవహారంలో చంద్రబాబును విచారణ జరపాలంటూ మరో పిటిషన్ ను సిఐడి అధికారులు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పీటీ వారెంట్ కింద చంద్రబాబును విచారణ జరిపేందుకు అనుమతినివ్వాలని పిటిషన్ వేయబోతోందని తెలుస్తోంది.

ఓ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నవారిని మరో కేసులో విచారణ జరిపేందుకు పీటీ వారెంట్ (ప్రిజనర్ ఇన్ ట్రాన్సిట్) రూపంలో పిటిషన్ వేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇవాళే ఆ పిటిషన్ వేస్తే, రేపు విచారణ జరిగే అవకాశముంటుంది. 2022లో అమరావతి ఇన్నర్ రింగు రోడ్డు అలైన్ మెంట్ లో అవకతవకలు జరిగాయని సీఐడీ కేసు నమోదుచేసింది. ఈ కేసులో భారీ భూ కుంభకోణం జరిగిందని ఆరోపణలు వచ్చాయి. అప్పటి టీడీపీ ప్రభుత్వం రింగ్ రోడ్ ఎలైన్‌మెంట్ మార్చిందని,ముందే స్థలాలు కొనేసి ఆ మార్గంలో రింగ్ రోడ్ వచ్చేలా టీడీపీ నేతలు ప్లాన్ చేశారని ఆరోపణలున్నాయి.

2014లో ఏపీ పురపాలక శాఖా మంత్రిగా ఉన్న నారాయణ ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నారాయణ వెనుక చంద్రబాబు ఉన్నారని, విచారణ జరపాలని సీఐడీ భావిస్తోందని తెలుస్తోంది. ఈ కేసులో సీఐడీ ఆల్రెడీ దర్యాప్తు పూర్తి చేసి నివేదికను కోర్టుకు సమర్పించింది. అయితే, హైకోర్టు నుంచి నిందితులు స్టే ఆర్డర్ తెచ్చుకోవడంతో తీర్పు రిజర్వులో ఉంది. ఈ కేసులో ఇప్పటివరకూ చంద్రబాబును ఒక్కసారి కూడా ప్రశ్నించలేదు.