జమిలి వల్ల మోడీ ఆశిస్తున్న లాభిమిదేనా?

Modi
Modi

ప్రస్తుత పరిస్ధితిలో జమిలిఎన్నికల నిర్వహణ ఎంతమాత్రం సాధ్యంకాదు. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల కమీషన్, కేంద్ర న్యాయశాఖ స్పష్టంగా గతంలోనే ప్రకటించాయి. జమిలి నిర్వహణపై కమీషన్ చాలా పార్టీలతో సమావేశం నిర్వహించింది. సాధ్యాసాధ్యాలపై పెద్ద కసరత్తే చేసింది. అంత జరిగిన తర్వాతే జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యంకాదని తేల్చేసింది. అలాంటిది సడెన్ గా నరేంద్రమోడీ ఇపుడు మళ్ళీ జమిలి ఎన్నికలని మొదలుపెట్టారు. నిర్వహణ సాధ్యాసాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ నాయకత్వంలో కమిటి కూడా వేసేశారు.

దేశమంతా ఏదో రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న కారణంగా అభివృద్ధి సాధ్యంకావటంలేదని మోడీ చెబుతున్నారు. అందుకనే జమిలి ఎన్నికలైతే ఎన్నికల ఖర్చులు కలిసొస్తుందని, సమయం కలసి వస్తుందని, అభివృద్ధిపై దృష్టి పెట్టవచ్చని చెబుతోంది. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు ఏమిటంటే రేపు ఏదైనా రాష్ట్రంలో ప్రభుత్వం కూలిపోతే అప్పుడు ఏమిచేస్తుంది కేంద్ర ఎన్నికల కమీషన్. ఎన్నికలు నిర్వహించకుండా రాష్ట్రపతిపాలనతో నెట్టుకొచ్చేస్తుందా ?

నిజానికి ఒకపుడు దేశంలోజమిలి ఎన్నికలే జరిగాయి. తర్వాత వివిధ రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలతో అర్ధాంతరంగా ఎన్నికలు నిర్వహించాల్సొచ్చింది. దాంతో జమిలి వ్యవస్ధ అస్ధవ్యస్ధమైపోయింది. ఈ విషయం మోడీకి కూడా బాగా తెలుసు. అయినా జమిలి జపం ఎందుకు చేస్తున్నారు ? ఎందుకంటే కేంద్రంలో బీజేపీ బలంగా ఉంది కానీ రాష్ట్రాల్లో లేదు. కేంద్రంతో పాటు రాష్ట్రాల్లో కూడా అధికారంలోకి రావటం బీజేపీ వల్ల కావటం లేదు.

పార్లమెంటుతో పాటు అసెంబ్లీల్లో కూడా బీజేపీ అధికారంలోకి రావాలంటే జమిలి ఎన్నికలు ఒకటే మార్గమని అనుకున్నట్లున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి ఓట్లేస్తున్న జనాలు అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ఇతర పార్టీలకు వేస్తున్నారు. మోడీకి ఇది చాలా ఇబ్బందిగా తయారైంది. పార్లమెంటు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే జనాలు రెండు ఓట్లను బీజేపీకే వేస్తారని మోడీ అనుకుంటున్నారు. అందుకనే జమిలీ జపం ఎత్తుకున్నారు. దీనికి ఖర్చులు, సమయం, అభివృద్ధనే కలరింగ్ ఇస్తున్నారంతే. మరి మోడీ ఆలోచన ఎంతవరకు సాకారమవుతుందో చూడాల్సిందే.