కామ్రెడ్లకు కాంగ్రెస్ కు జై కొట్టక వేరేదారిలేదు. కేసీయార్ చేసిన నమ్మకద్రోహాన్ని తట్టుకోలేకపోతున్నారు. పొత్తుల పెట్టుకుంటామని నమ్మించి చివరినిముషంలో కేసీయార్ తమను మోసం చేశారని సీపీఐ, సీపీఎం కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం మండిపోతున్నారు. ఈ విషయాన్ని వాళ్ళు మీడియా సమావేశంలోనే చెప్పారు. విచిత్రం ఏమిటంటే తమలోని తప్పులను దాచుకుని తప్పంతా కేసీయార్ మీద తోసేస్తున్నారు. అసలు కేసీయార్ ను నమ్మటమే వీళ్ళు చేసిన అతిపెద్ద తప్పు.
అవసరానికి దగ్గరకు తీసుకుని అవసరం తీరిపోయిన తర్వాత దూరంగా తరిమేయటం కేసీయార్ కు మొదటినుండి అలవాటే. ఈ విషయం వామపక్షాలకు బాగా తెలుసు. ఎందుకంటే గతంలో కూడా ఇలాగే దెబ్బతిన్నారు. వ్యక్తులైనా, పార్టీలైనా కేసీయార్ కు ఒకటే. ఎవరైనా తన అవసరానికి ఉపయోగపడాలని అనుకుంటారే కానీ తాను మాత్రం ఎవరికీ ఉపయోగపడటానికి ఏమాత్రం ఇష్టపడరు. ఇలాంటి కేసీయార్ మాటమీదుంటారని, తమతో పొత్తు పెట్టుకుని పదిసీట్లు ఇస్తారని కామ్రెడ్లు ఎలా నమ్మారో అర్ధంకావటంలేదు.
ఇపుడేమైంది తమను కేసీయార్ మోసంచేశారనే మంటతో కాంగ్రెస్ తో చేతులు కలిపేందుకు రెడీ అవుతున్నారు. బీఆర్ఎస్ ఓటమే లక్ష్యంతో తమ ఓట్లను కాంగ్రెస్ కు వేయించేందుకు రెండుపార్టీలు మాట్లాడుకుంటున్నాయి. తాము పోటీచేసే సీట్లలో కాంగ్రెస్ పోటీ పెట్టకుండా ఉంటే మిగిలిన నియోజకవర్గాల్లో తమ ఓట్లను కాంగ్రెస్ వేయించేట్లుగా చర్చలు జరుగుతున్నాయి. నిజానికి దీనివల్ల కూడా వామపక్షాలు నష్టపోతాయి.
ఎలాగంటే కేసీయార్ ను నమ్మద్దని తమతో చేతులు కలపమని కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అడిగారు. అప్పట్లో రేవంత్ పిలుపును వామపక్షాలు ఖండించాయి. బీఆర్ఎస్ తో తప్ప తాము మరేపార్టీతోనే పొత్తు పెట్టుకునేది లేదని గట్టిగా చెప్పాయి. దాంతో ఏమైందంటే వామపక్షాలు పోటీచేస్తాయని అంచనా వేసిన నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పోటీకి రెడీ అయిపోయింది. ఇపుడు ఆ నేతలను పోటీలో నుండి తప్పుకోమంటే వాళ్ళు అంగీకరించరు. దాంతో కచ్చితంగా అన్నీ నియోజకవర్గాల్లోను అందరు పోటీలో ఉండక తప్పని పరిస్ధితులు ఏర్పడ్డాయి. మరీ సమస్య నుండి వామపక్షాలు ఎలా బయటపడతాయో చూడాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates