పవన్ ఎంత మంది మీద పోటీ చేయాలి?

రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే విషయమై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు డిమాండ్ పెరిగిపోతోందా ? అంటే అవుననే చెప్పాలి. విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మూర్తి మాట్లాడుతు దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో పవన్ తనపై పోటీ చేయాలని చాలెంజ్ చేశారు. మరి పవన్ చాలెంజును స్వీకరిస్తారో లేదో తెలీదు. ఇప్పటికే తమపైన పోటీచేయాలని పవన్ కు భీమవరం సిట్టింగ్ ఎంఎల్ఏ గ్రంధి శ్రీనివాస్, కాకినాడ ఎంఎల్ఏ ద్వారపూడి చంద్రశేఖరరెడ్డి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పిఠాపురంలో పోటీచేయాలని చాలెంజులు చేశారు.

ప్రత్యర్ధులే కాదు సొంత పార్టీ నేతలు కూడా తమ నియోజకవర్గాల నుండి పోటీ చేయాలని పవన్ కు పదేపదే రిక్వెస్టులు పంపుతున్నారు. తిరుపతి, విశాఖ ఉత్తరం, భీమిలి, పిఠాపురం, నరసాపురం నియోజకవర్గాల నుండి పార్టీ నేతలు రిక్వెస్టులు పంపారు. కొన్ని నియోజకవర్గాల్లో అయితే పార్టీ కార్యవర్గాలు పోటీచేయాలని కోరుతు తీర్మానాలు కూడా చేసి పంపాయి. ఎవరెన్ని రిక్వెస్టులు చేస్తున్నా, చాలెంజులు చేస్తున్నా పవన్ మాత్రం నోరెత్తటం లేదు.

ఎందుకంటే తాను పోటీ చేయబోయే నియోజకవర్గాన్ని ఇపుడే ప్రకటిస్తే తన ఓటిమికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తారనే భయం పెరిగిపోతోంది. ఈ విషయాన్ని స్వయంగా పవనే ప్రకటించారు. తాను పోటీ చేయబోయే నియోజకవర్గాన్ని ఇపుడే ప్రకటిస్తే తనను ఓడించేందుకు జగన్ రు. 200 కోట్లు ఖర్చుచేయటానికి రెడీగా ఉన్నట్లు ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. పోటీచేయబోయే నియోజకవర్గంపై పవన్ ఎంతకాలం గోప్యత పాటిస్తారో అర్ధంకావటం లేదు.

ఇపుడు కాకపోయినా ఏదోరోజు ప్రకటించాల్సిందే కదా. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాతైనా పోటీ చేయబోయే నియోజకవర్గాన్ని పవన్ ప్రకటించక తప్పదు కదా. అప్పుడైనా ఓడించేందుకు జగన్ ప్రయత్నంచేస్తారు కదా. ఈ విషయాన్ని పవన్ ఎందుకు ఆలోచించడం లేదో అర్ధంకావటం లేదు. పోయిన ఎన్నికల్లో పవన్ పోటీచేసిన నియోజకవర్గాలు భీమవరం, గాజువాకను ముందుగా ప్రకటించలేదు. నామినేషన్లకు ముందు మాత్రమే ప్రకటించారు. అయినా రెండుచోట్లా ఓడిపోలేదా ? పవన్ను జగన్ ఓడిస్తారని అనుకోవటం, జగన్ను గెలవనీయనని పవన్ చాలెంజ్ చేయటం అంత ఉత్త సోది. గెలుపోటములు అంతా జనాల చేతిల్లోనే ఉంటుందని పవన్ మరచిపోయినట్లున్నారు.