ఆళ్ల‌గ‌డ్డ టీడీపీ టిక్కెట్ కోసం రంగంలోకి కీల‌క నేత‌…!


ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాలోని నంద్యాల‌, ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గాల్లో టికెట్ పోరు తార‌స్థాయికి చేరుకుంది. ఇది భూమా నాగిరెడ్డి కుటుంబంలోనే చిచ్చు రేపుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఆళ్ల‌గ‌డ్డ విష‌యం లోను.. నంద్యాల నియోజ‌క‌వ‌ర్గం విష‌యంలోనూ రేగిన టికెట్ మంట‌లు ఇప్ప‌ట్లో చ‌ల్లారేలా క‌నిపించ‌డం లేద‌ని ప‌రిశీల‌కులు కూడా చెబుతున్నారు. భూమా కుటుంబానికి ఈ సారి ఒక్క టికెట్ మాత్ర‌మే ఇవ్వాలని.. సీనియ‌ర్లు చెబుతున్నారు.

అది కూడా నంద్యాల‌తో స‌రిపెట్టాల‌ని అంటున్నారు. ఆళ్ల‌గ‌డ్డ టికెట్‌ను మాత్రం ఏవీ సుబ్బారెడ్డికి ఇవ్వాలనే చ‌ర్చ సాగుతోంది. దీనికి ఆయ‌న వియ్యంకుడు, విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మ‌హేశ్వ‌ర‌రావు కూడా.. మ‌ద్ద‌తు ఇస్తున్నారు. ఆళ్ల‌గ‌డ్డ‌లో ఏవీని గెలిపించుకునే బాధ్య‌త తాను తీసుకుంటాన‌ని కూడా బొండా చెబుతున్నారు. పార్టీ పొలిట్ బ్యూరో స‌భ్యుడు కావ‌డంతో ఆయ‌న మాట‌ను చంద్ర‌బాబు వింటార‌నే చ‌ర్చ కూడా జ‌రుగుతోంది.

గ‌త ఎన్నిక‌ల్లో ఆళ్ల‌గ‌డ్డ నుంచి భూమా అఖిల ప్రియ పోటీ చేశారు. అయితే, ఆమె ఓడిపోయారు. ఇప్పుడు కూడా త‌న‌కే టికెట్ ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. అయితే, ఏవీ సుబ్బారెడ్డికి, ఆమెకు మ‌ధ్య జ‌రుగుతున్న రాజ‌కీయ పోరులో..కీల‌క మ‌లుపు చోటు చేసుకుని.. ఇక్క‌డి నుంచి తానే పోటీకి దిగుతానంటూ.. త‌ర‌చుగా నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ నాయ‌కులతో ఏవీ సుబ్బారెడ్డి భేటీలు నిర్వ‌హిస్తున్నారు. ఇటీవ‌ల అఖిల ప్రియ నిర్వ‌హించిన కార్య‌క్ర‌మానికి కార్య‌క‌ర్త‌లు వెళ్ల‌కుండా కూడా ఆయ‌న నిలువ‌రించారు.

వ్య‌క్తిగ‌తంగా కూడా ఏవీ సుబ్బారెడ్డి త‌న స‌త్తా చాటుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అంత‌ర్గ‌త స‌మావేశాలకు.. బొండా ఉమాని కూడా ఆహ్వానిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆళ్ల‌గడ్డ నుంచి తానే పోటీకి దిగుతాన‌ని ఏవీ సుబ్బారెడ్డి చెప్పేస్తున్నారు. అయితే.. పార్టీ అధినేత చంద్ర‌బాబు మాత్రం ఎవ‌రికీ ఎలాంటి హామీ ఇవ్వ‌కుండా.. వేచి చూస్తున్నారు. వీరిలో ఎవ‌రికి ఇస్తే.. పార్టీ గెలుపు గుర్రం ఎక్కుతుంద‌నే విష‌యాన్ని కూడా ఆయ‌న ప‌రిశీలిస్తున్న‌ట్టు స‌మాచారం. ఏదేమైనా ఆళ్ల గ‌డ్డ టికెట్ కోసం.. పోరాటం మాత్రం మామూలుగా లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.