సంత‌కం ఓకే.. ఆర్టీసీ విలీనానికి గ‌వ‌ర్న‌ర్ ఆమోదం!

తెలంగాణ ప్ర‌భుత్వం స‌హా ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు ఆశ‌గా ఎదురు చూస్తున్న తెలంగాణ స్టేట్ ఆర్టీసీ ని ప్ర‌భుత్వంలో విలీనం చేసే బిల్లు విష‌యం కొలిక్కి వ‌చ్చింది. ఈ బిల్లుపై తీవ్ర‌స్థాయిలో నెల‌కొన్న ఉత్కంఠ‌కు తాజాగా గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై తెర‌దించారు. తాను ఈ బిల్లుకు వ్య‌తిరేకం కాద‌ని చెబుతూనే గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై.. ఈ బిల్లును మ‌రోసారి ప‌క్క‌న పెట్టేస్తార‌నే చ‌ర్చ సాగింది. అయితే.. అనూహ్యంగా ఆమె ఈ బిల్లుపై సంత‌కం చేశారు.

వాస్త‌వానికి అనేక బిల్లుల‌ను వ్య‌తిరేకిస్తూ వ‌చ్చిన గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై.. శ‌నివారం.. వ‌ర్చువ‌ల్‌గా తెలంగాణ ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల‌తో చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా కొన్ని సందేహాల‌ను ఆమె వ్య‌క్తం చేశారు. ఆర్టీసీ బిల్లుపై వారిని అనేక రూపాల్లో ప్ర‌శ్నించారు. అయితే, ఆయా సందేహాల విష‌యాన్ని ప్ర‌భుత్వంతోనే తాము తేల్చుకుంటామ‌ని.. ముందు మీరు సంతకం చేయాల‌ని కార్మికులు, ఉద్యోగులు విన్న‌వించారు. దీనికి.. స‌రేన‌న్న గ‌వ‌ర్న‌ర్ రాత్రికి రాత్రి పుదుచ్చేరి నుంచి హైద‌రాబాద్ చేరుకున్నారు.

ఈ సంద‌ర్భంగా ఆర్టీసీ ఉన్న‌తాధికారుల‌తో ఆదివారం ఉద‌యం నుంచి కూడా ఎడ‌తెగ‌ని మంత‌నాలు చేశారు. బిల్లులోని ప్ర‌తి అంశంపైనా ఆమె చ‌ర్చించారు. ఈ క్ర‌మంలో ఆమె తాను బిల్లుకు వ్య‌తిరేకం కాద‌ని మ‌రో సారి చెప్పారు. దీంతో ఇటు ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు ఇంకేముంది.. బిల్లుకు ఆమోదం తెలుపుతార‌ని.. అంద‌రూ ఎదురు చూశారు. కానీ గంట‌లు గ‌డుస్తున్నా.. ఉత్కంఠ‌కు మాత్రం ఆమె తెర‌దించ‌లేదు. మ‌రోవైపు నేటితో స‌భ ముగియ‌నుంది. ఇంత‌లో బిల్లుకు అనుమ‌తి ఇస్తూ.. గ‌వ‌ర్న‌ర్ నిర్ణ‌యం తీసుకున్నారు. మొత్తానికి తీవ్ర ఉత్కంఠ‌కు గ‌వ‌ర్న‌ర్ తెరదించారు.