ఏపీలోని జగన్ సర్కార్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో పంచాయతీల నిధులను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని పవన్ ఆరోపించారు. తమ హక్కుల కోసం పంచాయతీల, నిధుల కోసం సర్పంచులు రోడ్లపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల విడుదల, తమ సమస్యలు పరిష్కారం కోసం సర్పంచ్ లే ఢిల్లీలో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ను కలవడం, జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడం వంటి పరిణామల నేపథ్యంలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో సర్పంచుల సమావేశం ఏర్పాటు చేసిన పవన్…జగన్ పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో గ్రామాలకు సంబంధించిన నిధులను ప్రభుత్వం దోచుకుంటోందని ఆరోపించారు. సీఎం కార్యాలయం నుంచి గ్రామ పాలన జరగాలనుకోవడం సరికాదన్నారు. రాజ్యాంగపరంగా స్థానిక సంస్థలకు, పంచాయతీలకు దక్కాల్సిన హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించారు. కేంద్రం నిధులు నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాల్లోకి రావాలన్నారు.
ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. గ్రామసభలు పెట్టకుండా పంచాయతీలను నిర్వీర్యం చేశారని, పంచాయతీరాజ్ వ్యవస్థలో చెక్ పవర్ సర్పంచ్ కే ఉండాలని పవన్ అభిప్రాయపడ్డారు. వాలంటీర్ వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థలు కాంప్లిమెంటరీ సంస్థలని, అందులో పని చేసే ఉద్యోగులు వైసీపీ కార్యకర్తలుగా మారిపోయారని ఆరోపించారు. జనసేన అధికారంలోకి వస్తే సర్పంచ్ లకు అధికారాలు ఇస్తామని పవన్ చెప్పారు. మరోవైపు గల్ఫ్ ప్రతినిధులతో కూడా పవన్ భేటీ అయ్యారు.
ఏపీలో జనం ప్రశాంతంగా బతికే పరిస్థితులు లేవని, అన్యాయం జరిగితే ఎవరికి చెప్పుకోవాలో తెలియని దుస్థితి ఉందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ అన్యాయం జరిగితే తెలిసిన పోలీసు అధికారి గానీ, సొంత కులానికి చెందిన ఎమ్మెల్యే అయినా ఉండాలని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కౌన్సిలర్ స్థాయి వ్యక్తులు కూడా బెదిరించే పరిస్థితి ఉందని గల్ఫ్ లో బతుకుతున్న మనం ఇక్కడ ఎందుకు బతకలేకపోతున్నామని ప్రశ్నించారు.