అన్నింటినీ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లింక్ పెట్టడం ఏంటని ఆయన అభిమానులు ఫీలవుతుండవచ్చు కానీ…ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతున్న చర్చ మాత్రం హాట్ టాపిక్. అమెరికా అధ్యక్షుడు వినియోగించే ‘ఎయిర్‌ఫోర్స్ ఒన్’ విమానం తరహాలో రెండు బోయింగ్-777 ఈఆర్ విమానాలకు భారత్ గతంలో ఆర్డర్ ఇచ్చింది. వీటిలో ఒకటి సరఫరాకు సిద్ధంగా ఉంది.
దేశంలోని అత్యంత ప్రముఖ వ్యక్తులైన ప్రధాని, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి పర్యటనల కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన ఈ ‘ఎయిర్ ఇండియా వన్’ విమానం త్వరలో భారత్‌కు చేరనుంది. అయితే, ఇప్పుడు రావడంపైనే కొత్త చర్చ.
ప్రస్తుతం వీవీఐపీలు వినియోగిస్తున్న బీ 747 జంబో విమానాన్ని రాబోయే ఎయిర్ ఇండియా వన్ భర్తీ చేస్తుంది. అమెరికాలో ‘ఎయిర్ ఇండియా ఒన్’ విమానానికి అన్ని పరీక్షలు ముగిశాయి. దీని వినియోగానికి అమెరికా ఫెడరల్ వైమానిక యంత్రాంగం సర్టిఫికెట్ కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ విమానాన్ని భారత్ కు తీసుకువచ్చేందుకు ఒక టీం అమెరికా బయలు దేరినట్లు ప్రభుత్వంలోని ఉన్నత వర్గాలు ఏఎన్ఐ వార్తా సంస్థకు వెల్లడించాయి.
మనదేశంలోని వీవీఐపీల్లో అత్యధికంగా పర్యటనలు చేసేదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనే సంగతి తెలిసిందే. రాష్ట్రపతి తక్కువగా పర్యటిస్తుంటారు. ఉపరాష్ట్రపతి నామమాత్రంగానే. అంటే ఈ ప్రతిష్టాత్మక రెండు విమానాలు ప్రధానంగా మోదీజీ కోసమే వినియోగించబడతాయి.
ఈ రెండు విమానాలకు పెట్టిన ఖర్చు దాదాపు రూ.8458 కోట్లు. గతంలోనే ఈ మేరకు ఒప్పందం కుదరడం, విమానాలు సిద్ధమైపోయినప్పటికీ ప్రస్తుతం ఆ విమానం దేశంలోకి రావడమే విమర్శకులకు చాన్స్ ఇస్తోంది. ఓ వైపు దేశంలో కరోనా మహమ్మారి తీవ్రరూపం దాల్చుతుంటే మోదీజీ టూర్ల కోసం విమానాలు సిద్ధం చేసుకుంటున్నారని ఇప్పటికే మోదీజీ అంటే గిట్టని వాళ్లు ప్రచారం మొదలుపెట్టేశారు కూడా!