పొత్తుకు వెనకాడుతున్నారా ?

రాబోయే ఎన్నికల్లో బీజేపీతో పొత్తుకు చంద్రబాబునాయుడు వెనకాడుతున్నారా ? తాజాగా చేసిన వ్యాఖ్యలతో అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మీడియాతో చిట్ చాట్ లో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీతో పొత్తు ప్రస్తావన వచ్చినపుడు తనకు రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే ముఖ్యమన్నారు. బీజేపీతో పొత్తు విషయమై ఎన్నికలు వచ్చినపుడు ఆలోచిస్తానన్నారు. కేంద్రమంత్రి నారాయణ మాటలను గుర్తుచేసినపుడు ఎవరో దారినపోయే దానయ్యలు అన్న విషయమై తాను స్పందించలేనని ప్రకటించారు.

కేంద్రమంత్రి నారాయణ కర్నాకటలో మాట్లాడుతు రాబోయే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలు కలిసే పోటీ చేస్తాయన్నట్లుగా వ్యాఖ్యానించారు. దానిపైన కామెంట్ చేయటానికి చంద్రబాబు పెద్దగా ఇష్టపడలేదు. చంద్రబాబు తాజా వ్యాఖ్యలను చూసిన తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు వెనకాడుతున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే బీజేపీతో పొత్తు వల్ల టీడీపీకి నష్టం తప్పదని చాలామంది తమ్ముళ్ళు పదేపదే చెబుతున్నారట. ఎట్టి పరిస్ధితుల్లోను బీజేపీ పొత్తు పెట్టుకోవద్దని గట్టిగా చెబుతున్నారు.

నిజానికి చాలామంది తమ్ముళ్ళల్లో అసలు జనసేనతో పొత్తు పెట్టుకోవటం కూడా ఇష్టంలేదు. అయితే కాపుల ఓట్లకోసం తప్పదని అనుకుంటున్నారు కాబట్టి జనసేనతో పొత్తు ఓకే అంటున్నారు. ఇదే సమయంలో బీజేపీతో పొత్తు వల్ల నష్టమే తప్ప ఎలాంటి లాభం ఉండదంటున్నారు. తమ్ముళ్ళు చెబుతున్న విషయం చంద్రబాబుకు కూడా బాగా తెలుసు. అయినా ఎందుకని బీజేపీతో పొత్తుకోసం ఇంతకాలం ప్రయత్నాలుచేశారు ? ఎందుకంటే ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డికి కేంద్రం నుండి ఎలాంటి సాయం అందకుండా కట్ చేసేందుకు మాత్రమే.

బీజేపీని చంద్రబాబు కోరుకుంటున్నది ఈ సాయం తప్ప మరేమీలేదు. బీజేపీకి ఓటుబ్యాంకూ లేదు పట్టుమని పదిమంది గట్టి అభ్యర్ధులూ లేరన్న విషయం చంద్రబాబుకు బాగా తెలుసు. అయినా ఇంతకాలం పొత్తుకోసం ఎందుకు ప్రయత్నించారంటే అంతకుమించిన ప్రతిఫలం ఏదో ఉంది కాబట్టే. మరి తాజా వ్యాఖ్యలను చూసిన తర్వాత కమలనాదులతో పొత్తుకు చంద్రబాబు వెనకాడుతున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరి ఈ విషయంలో చివరకు ఏమి జరుగుతుందనేది సస్పెన్సుగా మారిపోయింది. ఏమి జరుగుతుందో చూడాలి.