వారాహియాత్రలో భాగంగా ఏలూరు సభలో మాట్లాడుతు రాష్ట్రంలో హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతోందని అందుకు వాలంటీర్లే కారణమని ఆరోపించారు. దాంతో వాలంటీర్లు చాలా తీవ్రంగా స్పందించారు. సోమవారం అంతా వాలంటీర్ల ర్యాలీలు, ధర్నాలు, నిరసనలతో హోరెత్తించారు. డీజీపీ, మహిళా కమీషన్ కు ఫిర్యాదులు చేశారు. వాలంటీర్లపై పవన్ చేసిన ఆరోపణ చాలా తీవ్రమైనది.
అంతటి తీవ్రమైన ఆరోపణలు చేసినపుడు దానికి మద్దతుగా తన దగ్గర ఆధారాలను పెట్టుకునుండాలి. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే అవన్నీ గాలికి పోతాయని పవన్ కు తెలీదా ? రాజకీయ ఆరోపణలు చేయటం వేరు నిర్దిష్టంగా ఒక వ్యవస్ధపై ఆరోపణలు చేయటంవేరు. అందులోను హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని వాలంటీర్లపై నోరుపారేసుకోవటం చాలా తీవ్రమైనది. దాంతో పెద్ద దుమారం మొదలైంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వాలంటీర్లు ఎప్పుడూ రాజకీయ కారణాలతో రెడ్డెక్కలేదు. ఏ పార్టీకూడా వీళ్ళపై ఆరోపణలు చేయలేదు. గతంలో ఒకసారి వాలంటీర్లపై చంద్రబాబునాయుడు నోరుపారేసుకున్నారు. అయితే ఎందుకనో తర్వాత మళ్ళీ ఎక్కడా మాట్లాడలేదు. కానీ పవన్ మాత్రం వారాహియాత్రలో తూర్పుగోదావరి జిల్లాలోనే మహిళల మిస్సింగ్ అంటు మాట్లాడారు. అయితే దాన్నెవరు పట్టించుకోలేదు. అందుకనే ఇపుడు హ్యూమన్ ట్రాఫికింగ్ అని, వాలంటీర్లే కారణమి రెచ్చిపోయారు.
తనపై ఎన్ని ఫిర్యాదులు చేసినా తాను లెక్కచేసేది లేదని కూడా పవన్ ప్రకటించారు. దీంతో వాలంటీర్లు మరింత రెచ్చిపోతున్నారు. ఈ విషయాలన్నీ పక్కనపెట్టేస్తే అసలు వాలంటీర్లను కెలకటం వల్ల పవన్ సాధించేది ఏమిటి అన్నది అర్ధంకావటంలేదు. రాజకీయనేతగా అన్నీ వర్గాలను దగ్గరకు తీసుకోవాల్సిందిపోయి బలమైన వాలంటీర్ వ్యవస్ధను ఎందుకు దూరంచేసుకుంటున్నారో అర్ధంకావటంలేదు. ఇక్కడ పవన్ మరచిపోయిందేమంటే వాలంటీర్లుగా పవన్ అభిమానులున్నారు, కాపులున్నారు, పైగా పెద్దఎత్తున మహిళలు కూడా ఉన్నారు. వేలాదిమంది మహిళలు నిజంగానే మిస్సయితే కుటుంబాల వాళ్ళు ఊరుకుంటారా ? ఏదేమైనా అనవసరంగా వాలంటీర్లను కెలుక్కుని పవన్ తప్పుచేసినట్ల అనిపిస్తోంది. మరీ వివాదం ఎక్కడి దాకా వెళుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates