అమెరికా మీడియా సంస్థకు మోడీ ప్రత్యేక ఇంటర్వ్యూ.. ఏం చెప్పారు?

ప్రధాని మోడీ అమెరికా టూర్ లో కీలకమైన పరిణామం జరిగింది. అగ్రరాజ్యం అమెరికా పర్యటన సందర్భంగా.. ఎంట్రీలోనే అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ వాల్ స్ట్రీట్ జర్నల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. తన అమెరికా పర్యటన ప్రారంభం కావటానికి ముందే.. ఆ మీడియా సంస్థకు చెందిన ప్రతినిధికి ఇంటర్వ్యూ ఇచ్చారు. అమెరికా టూర్ లో మ్యాగ్జిమమ్ మైలేజీ రాబట్టుకోవడానికి మొదటి అడుగే బలంగా పడిందంటున్నారు విశ్లేషకులు. అంటే… మోడీ అమెరికాలో అడుగు పెట్టేసరికి.. ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ అక్కడ హైలెట్ కానుందన్నమాట. ఇంతకూ వాల్ స్ట్రీట్ జర్నల్ కు మోడీ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్పారు.?

రష్యా – ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో భారత్ తటస్థ వైఖరి అనుసరిస్తుందా? అన్న ప్రశ్నకు మోడీ బదులిస్తూ.. తాము తటస్థం కాదని.. శాంతి వైపు నిలబడుతున్నట్లుగా చెప్పారు. అంతర్జాతీయ చట్టాలను ప్రతి దేశం గౌరవించాలన్న ఆయన.. దౌత్యపరమైన మార్గాలు.. చర్చల ద్వారా వివాదాల్ని పరిష్కరించుకోవాలని, ఇలా యుద్ధంతో కాదన్నారు.

ఈ సమస్య పరిష్కారం కోసం రష్యా.. ఉక్రెయిన్ దేశాల అధినేతలతో తాను పలుమార్లు మాట్లాడిన విషయాన్ని మోడీ గుర్తు చేశారు. భారత్ ఏం చేయగలదో అవన్నీ చేస్తుందని.. ఘర్షణలను పరిష్కరించి ఇరు దేశాల మధ్య శాంతి.. స్థిరత్వాన్ని తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలను తాము సమర్థిస్తున్నట్లు చెప్పారు. భారత్.. చైనా మధ్య సంబంధాల గురించి మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

  • దైపాక్షిక బంధాలు నిలవాలంటే సరిహద్దుల్లో శాంతియుత.. నిశ్చలమైన పరిస్థితులు ముఖ్యం.
  • వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవటంపై విశ్వాసం ఉంది.
  • భారత్ తన గౌరవాన్ని.. సౌర్వభౌమత్వాన్ని కాపాడుకోవటానికి సిద్ధంగా ఉంది.

తాము ఘర్షణ కోరుకోవటం లేదన్న విషయాన్ని స్పష్టం చేస్తూనే.. శాంతి మార్గానికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అదే సమయంలో.. అవసరమైతే తాము దేనికైనా సిద్దమన్న సంకేతాల్ని ఇవ్వటం గమనార్హం. స్వాతంత్య్ర భారతదేశంలో పుట్టిన తొలి ప్రధానమంత్రిని తానేనన్న మోడీ.. తన ఆలోచనా విధానాలు.. ప్రవర్తన అన్నీ దేశ చరిత్ర.. సంప్రదాయాల నుంచే ప్రేరణ పొందినట్లుగా ఉంటాయన్నారు. అదే తన బలమని.. దాన్నే ప్రపంచానికి పరిచయం చేస్తున్నట్లు చెప్పారు.

భారత్ – అమెరికా మధ్య బంధం గతంతో పోలిస్తే మరింత బలంగా ఉందన్న ప్రధాని మోడీ.. ఇరు దేశాల అధినేతల మధ్య అమితమైన విశ్వాసం ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల పరిస్థితుల్లో తయారీ.. సరఫరా చైన్ ను పెంపొందించుకోవటం కోసం బహుళజాతి సంస్థలు తమ వైపు చూస్తున్నాయని.. అయితే.. తాము ఏ దేశ స్థానాన్నీ భర్తీ చేయాలని అనుకోవటం లేదని పేర్కొనటం గమనార్హం. ప్రపంచంలో తాము సరైన స్థానాన్ని దక్కించుకోవాలని మాత్రమే కోరుకుంటున్నట్లుగా పేర్కొన్నారు.