ఏపీలో జనాలు కేసీయార్ నాయకత్వం కోరుకుంటున్నారా ? అవుననే అంటున్నారు బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్. హైదరాబాద్ లో మాట్లాడుతు వైసీపీ, టీడీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఆగమాగమైపోయిందని మండిపడ్డారు. పెరిగిన నిత్యావసర ధరలతో మధ్య జనాలు కుదేలైపోతున్నట్లు తోట తెగ బాధ పడిపోయారు. ఏపీలో ప్రత్యామ్నాయ పార్టీగా అందరు బీఆర్ఎస్ వైపే చూస్తున్నట్లు చెప్పారు. తాను ఎక్కడ పర్యటించినా అందరు బీఆర్ఎస్ రావాలనే కోరుకుంటున్నట్లు తెలుస్తోందని చెప్పారు.
సరే పార్టీ అధ్యక్షుడిగా తోట అలా చెప్పుకోవటంలో తప్పేమీలేదు. కానీ నిత్యావసరాల ధరల పెరుగుదలలో ఎక్కువగా కేంద్రప్రభుత్వమే కారణమని జనాలందరికీ తెలుసు. పెట్రోలు, డీజల్ ధరలను తగ్గిస్తే ఆటోమేటిక్కుగా నిత్యావసరాల ధరలు అవే తగ్గుతాయి. పెట్రోలు, డీజల్ ధరలను నియంత్రించేది కేంద్రమే కానీ రాష్ట్రప్రభుత్వాలు కాదన్న విషయం అందరికీ తెలుసు. ఏపీలో నిత్యావసరాల ధరలున్నట్లే తెలంగాణాలో కూడా దాదాపు అవే ధరలున్న విషయం తోటకు తెలీదా ?
నిత్యావసరాల ధరలతో ఏపీలో జనాలు ఆగమాగమవుతున్నారంటే తెలంగాణాలో జనాల పరిస్ధితి కూడా దాదాపు ఇలాగే ఉంటుందనటంలో సందేహంలేదు. మరప్పుడు కేసీయార్ పాలనలో కూడా జనాలు ఇబ్బందులు పడుతున్నట్లే కదా లెక్క. ఇక కేసీయార్ నాయకత్వం విషయం మాట్లాడాలంటే చాలా వుంది. తాజా పరిస్ధితుల్లో కేసీయారే తన దృష్టిని ఏపీ మీదనుండి మహారాష్ట్ర మీదకు మరల్చారు. రాష్ట్ర విభజనకు కేసీయారే కారణమన్న విషయం ప్రతి ఆధ్రుడికీ తెలుసు. అడ్డుగోలు విభజనలో కేసీయార్ పాత్రేమిటో కూడా జనాలకు అవగాహనుంది.
ఇక తెలంగాణాలోనే కేసీయార్ పాలనపై జనాల్లో బాగా వ్యతిరేకత కనబడుతోంది. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందనే విషయంలో చాలామంది అధికార పార్టీ నేతల్లోనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అందుకనే బీఆర్ఎస్ ను వదిలేసి కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ను వదిలేసే నేతల సంఖ్య మరింతగా పెరిగిపోయేట్లుంది. ఏ వర్గాన్ని కదిలించినా కేసీయార్ పాలనపై విపరీతమైన వ్యతిరేకత కనబడుతోంది. వాస్తవాలు ఇలాగుంటే తోట మాత్రం ఏపీలో కూడా కేసీయార్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పటం భలేగుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates