జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ఎందుకు మొదలుపెట్టారో అర్ధంకావటంలేదు. తాను ఎవరిని టార్గెట్ చేసుకుంటున్నారో తెలీటంలేదు. తన ఆలోచనలను తరచు ఎందుకు మార్చుకుంటున్నారో అర్ధంకావటంలేదు. రెండురోజుల వారాహియాత్ర చూసిన వాళ్ళకి పవన్ కన్ఫ్యూజ్ అవుతున్నారా ? జనాలను కన్ఫ్యూజ్ చేస్తున్నారో కూడా తెలీటంలేదు. ఇంతకీ విషయం ఏమిటంటే వారాహియాత్ర రెండోరోజు పిఠాపురంలో జరిగింది. ఈ సందర్భంగా చేనేత కార్మికులతో మాట్లాడుతు జనసేనను అధికారంలోకి తీసుకురావాలన్నారు. తనను ముఖ్యమంత్రిని చేయాలని కోరారు.
ప్రజల ఆలోచనల ప్రచారం పనిచేయలేకపోతే రెండేళ్ళల్లోనే పదవినుండి దిగిపోతానని ప్రకటించారు. ఆచరణసాధ్యంకాని హామీలను ఇవ్వనని చెప్పారు. ఇప్పటివరకు ఎంతోమందిని ముఖ్యమంత్రులుగా చూశారు కాబట్టి రాబోయే ఎన్నికల్లో జనసేనకు ఓట్లేసి గెలిపించి తనను ముఖ్యమంత్రిని చేయమని అడిగారు. పార్టీకి ఓట్లేయమని అడగటంలో, తనను సీఎంను చేయమని అడగటంలో తప్పేమీలేదు. కానీ పవన్ విరుద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్న కారణంగానే జనాల్లో అయోమయం పెరిగిపోతోంది.
మొన్నటివరకు కూటమితరపున చంద్రబాబునాయుడే ముఖ్యమంత్రి అన్నట్లుగా మాట్లాడారు. కూటమితరపున తనను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించమని అడగటానికి కూడా తనకు అర్హత లేదన్నారు. తనపార్టీకి ఓ 40, 50 సీట్లుంటే అప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించమని అడిగే అర్హత వచ్చుండేదన్నారు. పవన్ మాటలతో అందరికీ అర్ధమైందేమంటే కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబే సీఎం అని. టీడీపీతో పొత్తుంటుందని తమ పార్టీలను గెలిపించాలని జనాలను రిక్వెస్టుచేసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. టీడీపీతో పొత్తుపెట్టుకునే ఎన్నికలకు వెళతానని, ఒంటరిగా పోటీచేసేది లేదని గట్టిగా చెప్పారు.
మరి వారాహియాత్ర మొదలైనప్పటినుండి ఒంటరిగా పోటీచేస్తానా ? లేకపోతే సమూహంతో కలిసి పోటీచేస్తానా అన్నది ఇంకా నిర్ణయించలేదన్నారు. జనసేననే అధికారంలోకి తీసుకురమ్మంటున్నారు. తానే ముఖ్యమంత్రిని అవుతానని చెబుతున్నారు. జనరంజక పాలనను అందిస్తానని హామీఇస్తున్నారు. ఇంతకుముందు మాట్లాడినదానికి పవన్ ఇపుడు పూర్తి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడటం వెనుక వ్యూహం ఏదన్నా ఉందా అన్నది అర్ధంకావటంలేదు. నిజంగానే వ్యూహమేదైనా ఉంటే అది ఎంతవరకు వర్కవుటవుతుంది ? జనాలను కన్ఫ్యూజ్ చేయబోయే తానే కన్ఫ్యూజ్ అయిపోతున్నారా ?
Gulte Telugu Telugu Political and Movie News Updates