కోరి తెచ్చుకున్న మంట‌లు.. వైసీపీలో ప‌ట్టు త‌ప్పిన రాజ‌కీయం

ఏపీ అధికార పార్టీ వైసీపీలో నిన్న మొన్న‌టి వ‌ర‌కు అప్ర‌క‌టిత‌.. క్ర‌మ‌శిక్ష‌ణ ఖ‌చ్చితంగా అమ‌ల‌య్యేది. సీఎం జ‌గ‌న్ అన్నా.. నాయ‌కులు అన్నా.. ఎంతో గౌర‌వం ఉండేది. ఎవ‌రూ కూడా పార్టీ విష‌యంలో క‌ట్టు త‌ప్పేవారు కాదు. ఈ ప‌రిణామమే గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యాన్ని అందించింది. సీఎంగా జ‌గ‌న్‌ను ముఖ్య‌మం త్రి పీఠంపై కూర్చోబెట్టింది. అయితే.. ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింది. ఎక్క‌డిక‌క్క‌డ నాయ‌కులు క‌ట్టు త‌ప్పుతున్నారు..

పార్టీపైనా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఒక్క సీఎం జ‌గ‌న్‌ను త‌ప్పిస్తే.. మిగిలిన నేత‌ల‌పై నిప్పులు చెరుగుతున్నారు. నిజానికి ఎన్నిక‌ల‌కు ముందు.. ప్ర‌తిప‌క్షాలు చేయాల్సిన ప‌నిని సొంత పార్టీ నాయ‌కులే చేస్తుండడంతో వైసీపీ క్ర‌మ‌శిక్ష‌ణ‌పై నీలినీడ‌లు ముసురుకున్నాయి. అస‌లు ఏం జ‌రుగుతోంది? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. వాస్త‌వానికి.. కీల‌క నాయ‌కుల‌ను ప‌క్క‌న పెట్ట‌డం.. కొర‌గాని వారికి ప‌గ్గాలు అప్పగించ‌డ‌మే త‌ప్పైందా? అనేది ప్ర‌ధాన అంశం.

ఎందుకంటే.. దాదాపు అన్ని కీల‌క జిల్లాల్లోనూ పార్టీ త‌ర‌ఫున ఉన్న నాయ‌కులు సుప్త‌చేత‌నావ‌స్థ‌లో ఉన్నా రు. ఎవ‌రూ కూడా పెద్ద‌గా ముందుకు రావ‌డం లేదు. వీరి స్థానంలో పార్టీ త‌ర‌ఫున వాయిస్ వినిపించేందు కు కొందరు ముందుకు వ‌స్తున్నారు. అయితే.. వీరికి ప్ర‌జ‌ల్లో బ‌లం లేక‌పోవ‌డం.. పార్టీ త‌ర‌ఫున మాట్లాడే అవ‌గాహ‌న కొర‌వ‌డ‌డం కార‌ణంగా.. నాయ‌కులు ఎదురు తిరుగుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

దీంతో ఎక్క‌డిక‌క్క‌డ నాయ‌కులు పోరు లాభం అన్న‌ట్టుగా ముందుకు సాగుతున్నారు. కానీ ఇది ఎన్నిక‌ల ముంగిట పార్టీని బ‌ల‌హీన ప‌రుస్తోంద‌ని మెజారిటీ నాయ‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. వైవీ సుబ్బారెడ్డి కాల‌తీతుడు అని చెప్పుకొన్నా.. ప్ర‌జ‌ల్లో ఆయ‌న‌కు బ‌లం లేదు. ఇక, స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి వంటివారు.. ప్ర‌స్తుతం సీఈవోలుగా మాత్ర‌మే ప‌నిచేయ‌గ‌లుగారు త‌ప్ప‌.. ప్ర‌జ‌ల‌ను డీల్ చేయ‌లేరు. ఇవి తెలిసినా కూడా.. వైసీపీ అధినేత మౌనంగా ఉండ‌డంతో జిల్లాల్లో భోగి మంట‌లు రాజుకుంటున్నాయి.