కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ వదిలిపెట్టేట్లులేదు. చిన్నపుడు చందమామ పుస్తకంలో చదువుకున్న విక్రమార్క బేతాళుడి కథలాగ అయిపోయింది వ్యవహారం. ఎలాగైనా ఎంపీని విచారణకు రప్పించాలని సీబీఐ ప్రయత్నిస్తోంది. వీలైనంతలో విచారణ నుండి తప్పించుకునేందుకు అవినాష్ ప్రయత్నిస్తున్నారు. వివేకానందరెడ్డి హత్యకేసులో ఇప్పటికే సీబీఐ విచారణకు అవినాష్ ఆరుసార్లు హాజరయ్యారు. ఇక్కడ సమస్య ఏమిటంటే విచారణ వరకు పర్వాలేదు కానీ అరెస్టంటేనే ఎంపీకి ఇబ్బందిగా ఉన్నట్లుంది.
ఎంపీని అరెస్టుచేస్తామని సీబీఐ ఎక్కడా ప్రకటించలేదు. అవసరమని అనుకుంటేనే ఎంపీని అరెస్టుచేస్తామని కోర్టులో సీబీఐ చెప్పింది. అయితే ఈరోజు అరెస్టుచేస్తారు, రేపు అరెస్టు తప్పదనే ప్రచారం ఎంపీలో టెన్షన్ పెంచేస్తున్నట్లుంది. శుక్రవారం విచారణకు హాజరుకావాల్సిన ఎంపీ తన తల్లి అనారోగ్యంగా ఉంది కాబట్టి విచారణకు రాలేనని చెప్పి పులివెందులకు వెళ్ళిపోయారు. అందుకనే సోమవారం విచారణకు రావాలని మళ్ళీ నోటీసిచ్చింది.
సీబీఐ వైఖరి కూడా విచిత్రంగానే ఉంది. ఒక్కరోజు గ్యాపిచ్చి వెంటనే విచారణకు రావాలంటోంది. ఇప్పటికే ఆరుసార్లు విచారించినపుడు ఎలాంటి సమాచారం రాబట్టిందో ఎవరికీ తెలీదు. మామూలు విచారణలో చెప్పిన విషయాలను కస్టడీలోకి తీసుకున్నా కూడా చెబుతారు. ఇంతోటిదానికి కస్టడీలో తీసుకోవాలని సీబీఐ ఎందుకు అనుకుంటోందో అర్ధంకావటం లేదు. ఒకవేళ సీబీఐ అరెస్టు చేయదలచుకుంటే డైరెక్టుగానే ఎంపీని అరెస్టు చేసేయచ్చు. తర్వాత బెయిల్ విషయాన్ని కోర్టులో తేల్చుకుంటారు.
విచారణ పేరుతో వారాల తరబడి పిలిపిస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. విచారణకు హాజరైనపుడల్లా ఏడెనిమిది గంటల పాటు విచారించింది. ఇదే విషయాన్ని ఎంపీ ఎన్నిసార్లు అడిగినా సీబీఐ సమాధానం చెప్పటంలేదు. మొత్తానికి మనసులో ఏదో పెట్టుకునే ఎంపీని విచారణకు రావాలంటు పదేపదే నోటీసులతో వెంటపడుతోందన్న విషయం అర్ధమవుతోంది. చేయదలచుకున్నదేదో వెంటనే చేసేస్తే టెన్షన్ ఒక్కసారిగా తగ్గిపోతుంది. అలా కాకుండా ప్రతిరోజు ఎంపీకి నోటీసులిచ్చి విచారణకు హాజరుకావాలని పట్టుబట్టి టెన్షన్ పెట్టడమే సీబీఐ ఉద్దేశ్యమైతే ఇలా ఎంతకాలం సాగుతుందో కాలమే నిర్ణయించాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates