జనసేన అధినేత పవన్ సోదరుడు.. పార్టీ రాష్ట్ర ప్రధాన కారద్యర్శిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన నాగ బాబు.. చేస్తున్న వ్యాఖ్యలు.. పార్టీలోనూ.. పొత్తుల విషయాల్లోనూ కాక రేపుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. పొత్తుల విషయాన్ని ఒకవైపు పరిశీలిస్తూనే మరోవైపు.. పవన్ సిఎం అవుతారని.. పవన్ ముఖ్య మంత్రి పీఠం ఎక్కగానే.. హిందూ సంస్థలను గాడిలో పెడతారని నాగబాబు వ్యాఖ్యానించారు. అయితే.. నిజానికి పొత్తులు అంటే.. సీఎం పీఠాన్ని టీడీపీకి ఇచ్చేయాలనే విషయం అందరికీ తెలుసు.
అయినప్పటికీ.. నాగబాబు మాత్రం పదే పదే ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. కర్నూలులో జరిగిన కార్యక్రమంలోనూ గతంలో వచ్చేది మన ప్రభుత్వమే.. అయ్యేది మన నాయకుడే సీఎం అంటూ.. నాగబాబు వ్యాఖ్యానించారు. కానీ, ఇప్పుడు సీఎం అయ్యే ఛాన్స్ కేవలం పార్టీ ఒంటరిగా పోటీ చేస్తేనే సాధ్యమవతుంది. అది కూడా గెలిస్తేనే. కానీ, పరిస్థితి అలా లేదు కదా! పొత్తు పెట్టుకుని.. వైసీపీ ఓటు బ్యాంకు చీలకుండా చూసుకుని ముందుకు వెళ్తామని పవనే చెబుతున్నారు.
ఇలాంటప్పుడు నాగబాబుకు పొత్తుల ప్రభుత్వం వస్తే.. పవన్‌కు సీఎం సీటు దక్కదని తెలియదా? అంటే.. తెలుసు. మరి ఎందుకు ఇలా కామెంట్లు చేస్తున్నారు? అనేది ఆసక్తిగా మారింది. దీనికి ప్రధానంగా రెండు వ్యూహాలు ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. ఒకటి.. పవన్ సీఎం అభ్యర్థి అంటేనే తప్ప.. యువత జనసేన వెంట నడిచే పరిస్థితి లేదని ఆయన అంచనా వేసి ఉండాలని చెబుతున్నారు. అందుకే.. యువతను తమవైపు తిప్పుకొనేందుకు ఇలా చెబుతున్నారని అంటున్నారు.
అదే సమయంలో.. రేపు టీడీపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చినా.. జనసేనదే పైచేయిగా ఉండాలనే వ్యూహాన్ని ఇప్పటి నుంచి నాగబాబు ప్రయత్నిస్తున్నారని కొందరు భావిస్తున్నారు. అంటే.. మేం సీఎం సీటును త్యాగం చేశామని.. అది పవన్‌దేనని.. ఈ విషయాన్ని టీడీపీ గుర్తించాలనే భావన నాగబాబు ప్రధానంగా తీసుకువెళ్లాలని భావిస్తున్నట్టు తెలుస్తోందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అయితే.. ఈ రెండు పరిణామాలు కూడా.. రాజకీయంగా మంచిది కాదనేది కొందరు చెబుతున్న మాట.